కన్నీరుపెట్టిన కడవెండి..
దంతెవాడలో ఎన్ కౌంటర్..
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక మృతి..
వారం రోజుల వ్యవధిలో నెలకొరిగిన ఇద్దరు ఓరుగల్లు బిడ్డలు
స్పాట్ వాయిస్, బ్యూరో: చత్తీస్‌గఢ్‌లో మరోభారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో తరుచూ మావోయిస్ట్‌లకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు భారీగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా కడ వెండి గ్రామం. రేణుక LLB పూర్తి చేసింది. తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ అటు మహిళా సంఘంలో పనిచేస్తూ చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం రేణుక@ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరిని గా కొనసాగుతూ విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ నంబర్ గా కొనసాగుతున్నట్లు సమాచారం. 35 ఏళ్ల క్రితం పార్టీలోకి వెళ్లిన రేణుక తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక సోదరుడు న్యాయవాదిగా పనిచేస్తూ మరొకరు ఢిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు సమాచారం. కడవెండి గ్రామం అంటేనే రజాకార్లకు సైతం గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. విప్లవాల ఖిల్లాగా పేరు గడించింది. రేణుక మరణంతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Recent Comments