Wednesday, March 19, 2025
Homeతెలంగాణకూతవేటులో ‘కోటి’ దందా..

కూతవేటులో ‘కోటి’ దందా..

కూతవేటులో ‘కోటి’ దందా..
 సమయం మారింది సారూ..
– యథేచ్ఛగా బియ్యం దందా
– అరికట్టే వారే కరువు..
– నగర నలుమూలలా విస్తరించిన బియ్యం మాఫియా
– కొందరు అధికారుల సహకారం
– కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం
– పత్రికల్లో కథనాలు వస్తున్నా పట్టించుకోని అధికారులు
– హసనపర్తి అక్రమ దందాకు వెన్నెముకగా దేశాయిపేట, రెడ్డికాలనీ
– టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు
స్పాట్ వాయిస్, నిఘా విభాగం : వరంగల్ నగర నలుమూలలా విస్తరించి ఉన్న బియ్యం మాఫియా ఏడాదికి కోట్ల రూపాయల విలువ చేసే పేదల బియ్యాన్ని ఊహకందని విధంగా రాష్ర్ట సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమ రేషన్ దందాను అరికట్టాల్సిన కొంత మంది అధికారులు, దందా చేస్తున్న వ్యాపారుల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. హసన్ పర్తి శివారు లో విచ్చలవిడిగా జరిగే రేషన్ బియ్యం దందాపై లోకమంతా కోడై కూస్తున్నా, పత్రికల్లో కథనాలు వస్తున్నా సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేక పోవడం విచారకరమని పలువురు మండిపడుతున్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా జరుగుతుంటే స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చే పీడీఎస్ బియ్యాన్ని సైతం అక్రమ పద్ధతుల్లో సేకరించి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న దోపిడీపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. వరంగల్ కమిషనరేట్ తో పాటు సివిల్ సప్లయ్, సంబంధిత శాఖల్లో అక్రమ దందాలకు సహకరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

వేళ్లునుకున్న వ్యవస్థ..
నగర నలుమూలల్లో రేషన్ బియ్యం దళారీ వ్యవస్థ వేళ్లూనుకుంది. ఎవరి స్థాయిలో వారికి క్రమం తప్పకుండా ముడుపులు ముట్టజెపుతున్నందున ఇక తమను, తమ దందానూ ఏమీ చేయలేరనే ధైర్యం వారిలో మెండుగా ఉంది. అక్రమ రేషన్ బియ్యం దందా చేస్తూ రూ.కోట్లలో దండుకుంటున్నట్లు సంబంధిత అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టపగలు ఎలాంటి భయం లేకుండా పదుల సంఖ్యలో ట్రాలీలు, ఆటోల్లో రేషన్ బియ్యాన్ని నగరంలోని దేశాయిపేట, రెడ్డికాలనీ, అరేపల్లి, పైడిపెల్లి, అంబాల, కాశీబుగ్గ, మిల్స్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి హసన్ పర్తి శివారులోని డంపుకు చేరుస్తున్నారంటే ఇక్కడ ఏ మేరకు దళారీ వ్యవస్థ పాతుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ ప్రత్యేక విభాగాలు, సివిల్ సప్లై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వారి దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని జనం కూడా అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులు ప్రభుత్వ బియ్యం దొంగలకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిసిందే. వరంగల్, హన్మకొండ నగరాల్లో ప్రతిరోజూ లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ పంపిణీ బియ్యం వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పత్రికలో కథనాలు ప్రచురితం అవుతున్నప్పటికీ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు స్పందించక పోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బియ్యం మాఫియా డాన్ లు నగర నలుమూలల నుంచి ట్రాలీలు, ఆటోల ద్వారా సేకరించిన సరుకును మహారాష్ర్టకు తరలించేందుకు చకచకా లారీల్లోకి లోడ్ చేసి క్షణాల్లో పని కానిచ్చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ దళారీ వ్యవస్థను రూపు మాపడానికి కొంత మంది అధికారులు కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంకొందరు అధికారులు బియ్యం మాఫియా ఇచ్చే తాయిలాలకు తలొగ్గి సహకరిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా వరంగల్, హన్మకొండ నగరాల్లో దొంగ బియ్యం దందా వ్యవస్థను రూపు మాపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మారిన సీన్..
బియ్యం దందా సమయాలు మారాయి. గతంలో ఉన్న టైం అందరికి తెలిసి పోవడంతో వ్యాపారులు తెలివిగా లోడింగ్, అన్ లోడ్ వేళలు మార్చినట్టు సమాచారం. మాములుగానైతే అర్ధ రాత్రి జరిపే వ్యవహారం ఇప్పుడు ఉదయం 2-4 గంటల మధ్య చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఎక్కడి వారు అక్కడ నిద్రలోకి జారుకోవడం, ఎక్కడా అనుమానాలు రాకుండా ఉండడంతో ఆ సమయంలోనే పని కానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పలువురు సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతుండడం విశేషం. కాగా, ఇదే దందాలో గతంలో ఒక ఇన్ స్పెక్టర్ సహా పలువురు పోలీస్ సిబ్బందికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని విచారించినట్లు సమాచారం. పైగా పలువురు అధికారులను వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు చేశారనే గుసగుసలు కూడా అదే శాఖలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. అనంతరం కొద్ది రోజులు స్తబ్ధగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మళ్లీ మొదలై దర్జాగా సాగుతున్నట్టు వినికిడి. ఏదేమైనా హసన్ పర్తి సమీపంలో బియ్యం బిజినెస్ వందల క్వింటాళ్ళు.. కోట్ల సంపాదన అన్నట్టుగా సాగడంపై తీవ్ర అనుమనాలకు తావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments