ఇద్దరు వృద్ధుల దుర్మరణం
ముగ్గురికి స్పల్ప గాయాలు
దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం
ఖానాపూర్ మండలంలో ఘటన
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : టైరు పగిలి కారు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన ఖానాపూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రఘుపతి, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెలు ఏసిరెడ్డి యశోద(80), బోలుకొట్టు మాణిక్యమ్మ (78) తమ పిల్లలతో కలిసి మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు హాజరయ్యారు. కారులో తిరిగి వస్తుండగా ఖానాపురం మండలం బుధరావుపేట శివారు అయినపల్లి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే టైరు పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో యశోదమ్మ, మాణిక్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. యశోద కుమారుడు రమేష్ కారు నడుపుతుండగా, మాణిక్యమ్మ కుమారుడు హరీష్, కూతురు అనిత కారులో ఉన్నారు. వీరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Recent Comments