Friday, March 14, 2025
Homeక్రైమ్భర్త హత్యకు భార్య సుఫారి

భర్త హత్యకు భార్య సుఫారి

హొలీ పండగలోపు బ్యాంకు ఉద్యోగి హత్యకు ఒప్పందం
ప్లాన్ ఫెయిల్.. పోలీసుల అదుపులో అనుమానితులు.?
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : కట్టుకున్న భర్తను కడ తీర్చేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ ఫెయిల్ అయిన ఘటన నర్సంపేట నియోజకవర్గంలో సంచలనం రేపుతోంది. ఈ మధ్య వరంగల్ లో ఒక డాక్టర్ పాశవిక హత్యకు గురైన సంఘటన మరువక ముందే నర్సంపేట మండలానికి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి హత్యకు సైతం పెద్ద మొత్తంలో సుఫారీ అందజేయడం కలకలం రేపుతోంది. విశ్వనీయ సమాచారం మేరకు.. నర్సంపేట మండలం ఆకుల తండా గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత ఏడేళ్ల కిందట నర్సంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరగగా, వీరికి ఓ పాప ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట సదరు బ్యాంక్ ఉద్యోగికి ఓ ఆగంతకుడు కాల్ చేసి రూ.3 లక్షలు డబ్బులు ఇస్తే నీకు విలువైన సమాచారం ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట పట్టించుకోకున్నా తర్వాత అతను చెప్పిన విషయాలు చూసి కంగారు పడ్డాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో భయపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం సదరు కాల్ చేసిన యువకుడిని ట్రాప్ చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సదరు మహిళ భర్త హత్య కోసం రూ.10 లక్షల డీల్ ఇచ్చినట్లు బయటపడింది. ఇందులో ఒక్కొక్కరికి రూ.20 వేలు మొదటి దఫాగా చెల్లించినట్లు సైతం ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందులో ఆకుల తండాకు చెందిన ఓ యువకుడు ప్రధాన భూమిక పోషించినట్లు విచారణలో తేటతెల్లమైంది. సదరు యువకుడు ఇచ్చిన సమాచారంతో తొర్రూరు కి చెందిన ఒకరిని, రాయపర్తి కి చెందిన ఒకరిని, మహేశ్వరం గ్రామానికి చెందిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో అతడి భార్యతో సహా నలుగురు యువకులు పథకం పన్నినట్లు గుర్తించారు. హొలీ పండగ లోగా సదరు బ్యాంకు ఉద్యోగిని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులను సంప్రదించగా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments