పౌడర్ పాలు వికటించి కవల పిల్లలు మృతి
గణపురంలో మండలంలో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. పౌడర్ పాలు వికటించి నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మర్రీ అశోక్-లాస్య దంపతులకు నాలుగు నెలల క్రితం రెండో సంతానంలో కవలు ( పాప, బాబు) జన్మనించారు. తాజాగా లాస్య పిల్లలతో తల్లిగారిల్లు అయిన నగరం పల్లెకి వెళ్లింది. పాలు పిల్లలకు సరిగా అందకపోవడంతో.. భర్తకు విషయం చెప్పగా.. గణపురం మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాపులో పాల పౌడర్ తీసుకొచ్చాడు. దీంతో శనివారం ఉదయం 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు మరోసారి తాగించి పిల్లలను పడుకోబెట్టింది. అయితే 12 గంటల సమయంలో పిల్లల్లో కదిలికపోవడంతో.. అనుమానం వచ్చి చూడగా.. ముక్కుల్లోంచి పాలు కారుతూ కనిపించింది. దీంతో హుటాహుటినా స్థానిక ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. పౌడర్ పాలు తాగడం వల్లే పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు కనుల ముందే విగతజీవులగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments