తీరికలేదేమో..?!
మీ సేవ సెంటర్ల అక్రమ వసూళ్లపై చర్యలకు జాప్యం
ఆ మూడు సెంటర్ల సేవలో తహశీల్ ఆఫీసు సిబ్బంది..!
రిసిప్ట్ లు ఇవ్వకపోయినా.., అధిక వసూళ్లు చేసినా పట్టింపు శూన్యం
బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..
ఆ సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు..
వెలుగులోకి వచ్చిన అఫిడవిట్ల దందా..
లాయర్ స్టాంప్, సిగ్నిచర్ వారిదే..
విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయంటున్న ప్రజలు
ఈఎస్డీ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ప్రజాసంఘాలు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లిలో మీ సేవ సెంటర్ల దందాపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు కదలడం లేదు. బాజాప్తా తహశీల్దార్ కార్యాలయంలోని కొంత మంది సిబ్బంది అండతో సర్టిఫికెట్ల దందా చేస్తున్నా.. అధిక వసూళ్లకు పాల్పడుతున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు.. నెలకో ఫిర్యాదు బాధితుల నుంచి వస్తున్నా ఇప్పటి వరకూ ఆ మూడు సెంటర్ల వైపు కన్నెత్తి చూసింది లేదు. కేవలం పిలిచి మాట్లాడడం, నిబంధనలు పాటించాలని చెప్పడం.. ఆ తర్వాత అంతా యథావిధినే. మనోళ్లు రిసిప్ట్ లేకుండానే.. 45 రూపాయల సర్టిఫికెట్ కు రూ.100 నుంచి 150 వసూల్ చేస్తారు. బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్లకు రూ. 5వేల వరకు లాగేస్తారు.
ఆ మూడు సెంటర్ల నుంచే పదుల సంఖ్యలో..
భూపాలపల్లిలోని రెండు సెంటర్లు, పాత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మరో మీ సేవ సెంటర్లలో నడుస్తున్న దందాపై అధికారులకు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. కానీ తహశీ కార్యాలయ సిబ్బందితో ఉన్న చనువుతో వారిపై చర్యలు ఉండడం లేదు. ఈ సెంటర్ల నిర్వాహకులు సర్టిఫికెట్లు దరఖాస్తు చేయగానే.. ఒకరిని పంపి.. ఆ ఫైళ్లకు సంబంధించిన క్లియర్స్ అంతా క్లోజ్ చేపించుకొని వస్తారంట. వేరే ఏ సెంటర్ సర్టిఫికెట్లు ఉన్నా.. వీటి తర్వాతే వాటి గురించి ఆలోచిస్తారని టాక్. మరి వీళ్లుకు వాళ్లకు మధ్య ఉన్న సేవ ఏంటోనని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వెలుగులోకి వచ్చిన అఫిడవిట్ల దందా..
ఆ మూడు మీ సేవ సెంటర్లలో ఇప్పటి వరకు సర్టిఫికెట్లకు అధిక వసూళ్లు, సింగరేణి ఉద్యోగులకు ఓబీసీ, ఆదాయ సర్టిఫికెట్లు యథేచ్ఛగా జారీ చేస్తున్నారని తెలుసు. అయితే తాజాగా క్యాస్ట్, ఇన్ కం, రెసిడెన్సీ సర్టిఫికెట్ల కోసం కావాల్సిన లాయర్ అఫిడవిట్లు సైతం వీరే జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దందాపై విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలు సైతం కొట్లాడి.. అధికారులకు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలిసింది. అయినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఏకంగా లాయర్ల అఫిడవిట్లనే ఫోర్జరీ చేయడం ఎంత దారుణమో గమనించాల్సి ఉంది. గతంలో ఓ ఆన్ లైన్ సెంటర్ లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.
ఈఎస్డీ కమిషనర్ కు ఫిర్యాదు..
మూడు మీ సేవ సెంటర్లలో జరుగుతున్న భారీ దందాలపై హైదరాబాద్ లోని ఈఎస్డీ కమిషనర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రజా సంఘాల నాయకులు రెడీ అయ్యారు. ఇవ్వాలో రేపో.. మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తామని, ఆ మీ సేవ సెంటర్ల దందాల విషయమై ‘స్పాట్ వాయిస్’ దినపత్రికకు ఫోన్ చేసి తెలపడం గమనార్హం. సదురు మీ సేవ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటే పేద ప్రజలకు మేలు జరుగుతుందని కోరుతున్నారు.
Recent Comments