స్కూళ్లకు ఒంటి పూట బడులు
రాష్ట్రంలో బుధవారం నుంచి అమలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట మాత్రమే పని చేయనున్నాయి. రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణనకు ఉపాధ్యాయులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యా శాఖ నుంచి 50 వేల మంది వరకు సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 36 ,559 మంది ఎస్జీటీ, 3,414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6,256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చారు. సర్వే పూర్తి అయ్యేవరకు ఇది అమల్లో ఉంటుందని ఇప్పటికే సర్కార్ స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొననున్న ఉపాధ్యాయులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వేతనాలు చెల్లిస్తుందని వెల్లడించింది.
Recent Comments