కేయూ భూఆక్రమణ కేసు విచారణ నేడే…
ఏంఆర్వో రిపోర్టును మున్సిపల్ అధికారులు కోర్టులో సమర్పించనున్నారా?
ఇంజక్షన్ ఆర్డర్ రద్దు అవుతుందా?
స్పాట్ వాయిస్ , ఓరుగల్లు : కాకతీయ యూనివర్సిటీకి చెందిన 229 సర్వే నెంబర్ లో యూనివర్సిటీ కి చెందిన ఉద్యోగులే కాకుండా ఇతరులు కూడా ఇండ్లు కట్టుకున్నారని రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్ చేయించిన సర్వే లో బయటపడింది. దీనికి గాను 13 మందికి మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా అప్పట్లో జారీచేశారు. ఈ భూ ఆక్రమణ విషయం తేలకపోయేసరికి కేయూ అధ్యాపక సంఘం బాధ్యులు, విద్యార్థి సంఘాలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో మళ్ళీ ఫిజికల్ సర్వే చేయించగా గతంలో చేసిన సర్వే మాదిరిగానే 229 కేయూ సర్వే నెంబర్ లో భూ ఆక్రమణలు జరిగినవి వాస్తవమేనని తేల్చారు. ఇటీవల ఏం.ఆర్.వో రిపోర్టులో కూడా ఇదే విషయం పొందుపరిచారు. మళ్ళీ రెండవసారి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో భూ ఆక్రమణ దారులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు గత మాసం సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రెండు సార్లు తాము మున్సిపల్ నోటీసులకు సమాధానం ఇచ్చామని మాకు మా ఇండ్లను కూల్చేస్తామని నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూలుస్తారని మాకు రక్షణ కావాలని హైకోర్టును వాళ్ల న్యాయవాది ద్వారా కోరారు. మున్సిపల్ అధికారులు మీ ఇండ్లను కూల్చేస్తామని నోటీసులు ఇవ్వకుండానే మీరు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కావున మీకు రక్షణ ఇవ్వడం కుదరదని, ఈ 13 మంది సమర్పించిన సమాధానాన్ని గమనించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశిస్తూ అదే నెల 12 వ తేదీన ఆ పిటీషన్ ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా హన్మకొండ జిల్లా కోర్టులో అదే నెల 24 వ తేదీన ఏ.ఆర్ అశోక్ బాబు ఇంటితో బాటు భూ ఆక్రమణ దారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగితా ఇంటి యజమానులు ఇంజంక్షన్ ఆర్డర్ లను తెచ్చుకున్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చవద్దని జిల్లా కోర్టు ఉత్తర్వులను జారీ చేసి మున్సిపల్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ విషయంపై అక్టోబర్ 23 న కౌంటర్ వేయాలని పేర్కొంది. దీంతో బుధ వారం ఇంజక్షన్ ఆర్డర్ రద్దు అవుతుందా, మున్సిపల్ అధికారులు ఏం.ఆర్.వో రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
Recent Comments