Saturday, November 16, 2024
Homeరాజకీయంఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..

దేవాలయాల జోలికివస్తే ఖబర్దార్
మసీద్ లు, చర్చిల గురించి మాట్లాడే దమ్ముందా..
గుర్తింపు కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు..
ఎమ్మెల్యే నాగరాజు మానసిక స్థితి సరిగాలేనట్టుంది..
క్షమాపణ చెప్పు.. లేదంటే తీవ్ర పరిణామాలు
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

స్పాట్ వాయిస్, వరంగల్: నోరు ఉంది కదా అని హిందూ సంప్రదాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని, పేపర్లో కనిపించడానికో..జనాల్లో చర్చకో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ వరగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉనికి కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని, పోలీస్ ఆఫీసర్ గా చేసిన, ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలు కానీ సమాజం గుర్తించకపోవడంతోనే, ఐడెంటి క్రైసిస్ లో భాగంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని గంట రవికుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లు కొంతమంది రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చల్లోకి వచ్చి టీవీలలో పేపర్లో కనిపించడం ఒక సంప్రదాయంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లందరూ హిందూ సమాజంపైన హిందూదేవతల పైన, దేవాలయాల పైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. గుడి గురించి మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు చర్చి మసీదు మదర్సాల గురించి మాట్లాడే దమ్ముందా…? అంటూ ప్రశ్నించారు. భారతదేశ ప్రాచీన ఆత్మ దేవాలయమని, మన దేశంలో జ్ఞానబోధ ప్రారంభమైంది గుడి నుంచేనని చెప్పారు. బడులు లేని కాలంలో కూడా భారతదేశంలో విద్యను గుడి కేంద్రంగానే నేర్పించేవారని గుర్తు చేశారు. దేవాలయమైన, దేవుడైన ఈ దేశ ప్రజలకు ఓ నమ్మకమని, ఆ నమ్మకాన్ని తప్పుపట్టడం అవివేకమన్నారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేఆర్ నాగరాజు ఇలా ఒక మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, ప్రతి హాస్పిటల్ ముందు ఒక గుడి ఉంటుందని, అంతరిక్షంలో జరిగే పరిశోధనలకు నిలయమైన ఇస్రో శాస్త్రవేత్తలు సైతం రాకెట్ ప్రయోగానికి ఉపగ్రహ ప్రయోగానికి ముందు దేవుడి ముందు పూజలు చేస్తారన్నారు. అంబేద్కర్ సైతం బుద్ధ ఆలయంలోనే తన జ్ఞానాన్ని ఇతరులకు పంచాడని తెలిపారు. ఈ కనీస పరిజ్ఞానం లేకుండానే చట్టసభల్లోకి వెళ్లడం దురదృష్టకరమన్నారు. హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దళిత వాదం ముసుగులో హిందుత్వంపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని, హిందూ దళిత సంఘాలు కూడా ఆయన వైఖరిని తప్పుపడుతున్నాయని చెప్పారు.ఎస్సీ వర్గీకరణను కూడా తప్పు పట్టిన ఘనుడు ఈ ఎమ్మెల్యే నాగరాజు అని, దళితుల్లో అట్టడుగు వర్గాల వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఎస్సీల్లోని ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం వ్యతిరేకించడం ఎమ్మెల్యే నాగరాజు మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ప్రజాప్రతినిధి కావడం దురదృష్టకరమని, ఆయన చేసిన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్రపరిమాణలు ఉంటాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments