Friday, September 27, 2024
Homeటాప్ స్టోరీస్తెలంగాణలో ర్యాంకుల ‘‘పంట’’

తెలంగాణలో ర్యాంకుల ‘‘పంట’’

వరిలో నెంబర్ వన్..
పత్తిలో థర్డ్..
పొద్దు తిరుగుడులో ఫోర్త్
చిరుధాన్యాల్లో ఫిఫ్త్..
తెలంగాణ స్టేట్ రికార్డ్..
నివేదిక రిలీజ్ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో సాగులో సత్తా చాటింది. వరి దిగుబడిలో 2023-24లో దేశంలోనే టాప్ గా నిలిచింది. అలాగే పత్తి దిగుబడిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాల నివేదికను కేంద్రవ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ అంచనాలను రూపొందించింది. పంటలపై రిమోట్‌ సెన్సింగ్, ప్రతి వారం రూపొందించే క్రాప్‌ వెదర్‌వాచ్‌ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన డేటాను సరిపోల్చుకొని తుది నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడులు రికార్డుస్థాయిలో బాగా పెరిగినట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి.
26.11 లక్షల టన్నులు అధికం
దేశవ్యాప్తంగా 2023-24లో ప్రధాన పంటలు 3,322.98 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2022-23 సంవత్సరం నాటి తుది అంచనాలతో పోలిస్తే ఇది 26.11 లక్షల టన్నులు అధికం. పంటల వారీగా గోధుమ 27.38 లక్షలు, వరి 20.70 లక్షలు, చిరుధాన్యాలు 2.51 లక్షల టన్నుల మేర దిగుబడులు పెరిగాయి. 2023-24లో మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో కరవులాంటి పరిస్థితులు, రాజస్థాన్‌లో సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల సోయాబీన్, పప్పు దినుసులు, పత్తి వంటి పంటలపై ప్రభావం చూపినట్లు కేంద్రం తెలిపింది. 2023-24లో వరి దిగుబడిలో 168.74 లక్షల టన్నులు సాధించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన వరి దిగుబడుల్లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తర్‌ప్రదేశ్‌ (159.90 లక్షల టన్నులు), పశ్చిమబెంగాల్‌ (156.87), పంజాబ్‌ (143.56), ఛత్తీస్‌గఢ్‌ (97.03) రాష్ట్రాలు నిలిచాయి. ఇక ఏపీలో వరి దిగుబడి 73.42 లక్షల టన్నులుగా తుది అంచనాలు వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో ఇదే అతి తక్కువ నమోదు కావడం గమనార్హం
చిరుధాన్యాల్లోనూ మనమే..
తెలంగాణలో పండిన మిగతా పంటలలో చిరుధాన్యాలు 199.15 లక్షలు, మొక్కజొన్న 27.79 లక్షలు, పొద్దుతిరుగుడు 0.15 లక్షల టన్నుల దిగుబడులు సాధించింది. అలాగే 50.80 లక్షల బేళ్ల పత్తిని ఉత్పత్తి చేసింది. కంది పంట దిగుబడులకు సంబంధించి దేశవ్యాప్తంగా 34.17 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించగా తెలంగాణలో 1.45 లక్షలు, ఏపీలో 0.96 లక్షల టన్నులుగా లభించింది. అలాగే దేశంలో శనగపంట దిగుబడి 110.39 లక్షల టన్నులు కాగా తెలంగాణలో 1.64 లక్షల టన్నుల దిగుబడి లభించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments