ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యదేవర కార్తీక్
స్పాట్ వాయిస్, గణపురం: తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు సూర్యదేవర కార్తీక్ డిమాండ్ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదని, దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్మాగాంధీ ప్రశంసలందుకున్నారని, ఆ మహనీయుడి జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ, ఆయన్ని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని, లేనిపక్షంలో ఆర్యవైశ్యులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
Recent Comments