ఆశావహులు ఆగాల్సిందే..
దసరా నుంచి పోస్ట్‌పోన్
బీసీ కులగణనతో మరింత ఆలస్యం
కులగణన మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న సీఎం..
వచ్చే ఏడాదే లోకల్ బాడీల ఎన్నికలు
పాత రిజర్వేషన్లు మారే ఛాన్స్..
గ్రామ పంచాయతీల ఎన్నికలు మరింత ఆలస్యమవడమే కాదు.. పాత రిజర్వేషన్లు మారే అవకాశం కనిపిస్తోంది. జనవరి 31తో జీపీల పదవీ ముగిసిన జీపీల పదవీకాలం ముగిసింది. దీంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన సర్కార్ పల్లెల్లో పట్టు సాధించాకే ఎన్నికలకు పోవాలనే ఆలోచన చేసింది. దీంతో రుణమాఫీ అనంతరం దసరా వరకు ఎన్నికలు నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రుణమాఫీలో విఫలమవడం, రైతు భరోసా కల్పించకపోవడం, ఫించన్లు పెంచకపోవడం వంటివి ఉండడంతో ఎన్నికలపై దాటవేత ధోరణి అవలంభిస్తోంది. దీనికి తోడూ… బీసీ రిజర్వేషన్ల విషయం ఎటూ తేలకపోవడం, కులగణన డిమాండ్ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు 2025లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే సీఎం రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామడం.. కూడా ఎన్నికలు ఇప్పట్లో ఉండవనే దానికి బలం చేకూరుస్తున్నాయి.
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. దసరా వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయనే ప్రచారం సాగినా.. బీసీ గణన నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికల బరిలో నిలవాలనే ఆశావహుల కోరిక తీరేలా కనిపిస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కుల గణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడువస్తుందా..? అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లైంది. పంచాయతీల పాలక వర్గాలు ముగిసినప్పటి నుంచి ఆశావహులు గ్రామాల్లో నిత్యం సందడి చేస్తూ కనిపిస్తున్నారు. చావులు, బతుకులు, ఫంక్షన్లు ఇలా అన్నింటికీ హాజరవుతూ.. తామున్నామనే సంకేతాలు పంపారు. అయితే ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉండడంతో వారిలో ఉత్సాహం నీరుగారిపోయింది.
‘‘ 2019లో తెలంగాణలోని 12, 769 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అప్పటి బీఆరఎస్ ప్రభుత్వం మరో 224 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కలిపి ఇపుడు 12,993 గ్రామ పంచాయతీలు అయ్యాయి. వీటి ఎన్నికల కోసం కులగణన అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణను ముఖ్యంగా బీసీకుల గణను చేపడతామని హామీ ఇచ్చింది.’’
సందిగ్ధంలో సర్కార్
ఓటరు జాబితా సవరణ పూర్తైన వెంటనే నిర్ణీత గడువులోగా బీసీ రిజర్వేషన్లు పంపించాలని బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడు ఉన్న పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? లేదా ? అనే దానిపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో నూతనంగా పంచాయతీ రాజ్‌చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం రెండు సార్లు ఒకే రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా..? కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలా..? అని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. వీటితో పాటు ఉపకులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా ..? లేదా ..? వేచి చూడాల్సిందే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా స్థానిక సంస్థల పరిధిలో కులాల గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరిపి.. ఆయా చోట్ల ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది తేల్చాలని సూచనలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా అన్ని కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది.
రిజర్వేషన్లు తేలేనా..?
కులగణన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై గణాంకాలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ 2025లోనే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కులగణనపై ముఖ్యమంత్రి ప్రకటన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ నేపథ్యంలో గత సర్కారు అమల్లోకి తెచ్చిన ‘పంచాయతీ రాజ్ చట్టం-2018 అమలుపై సందిగ్ధం ఏర్పడింది. ఒక వేళ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇదే జరిగితే పాత రిజర్వేషన్ల ప్రాతిపదికన 8 నెలలుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఆలోచనలు తారుమారయ్యే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల కమిషన్ స్పీడ్..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారు చేయించడం, వాటిని ప్రచురించం కోసం గతంలోనే రాష్ర్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. (సెప్టెంబర్ 21) శనివారం తుది ఓటరు జాబితా ప్రచురించారు. ఓటరు జాబితా సిబ్బంది తర్వాత వార్డుల వారీగా పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలుంటాయని వివరించింది. అయితే ఎన్నికల కమిషన్ స్పీడ్ తో దగ్గర్లోని ఎన్నికలు అనుకున్న గ్రామస్థాయి లీడర్లకు.. సీఎం ప్రకటనతో ఇప్పట్లో ఉండవనే క్లారిటీ వచ్చేసింది.
ప్రత్యేకంలో కష్టాలు..
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చే అవకాశం లేదు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత వరకు ఒక్క పైసా కూడా నిధులను విడుదల చేయలేదు. దీంతో గ్రామ పంచాయతీలు నిధులు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
నారాజ్ అయిన కాంగ్రెస్ నేతలు..
సీఎం మాటలతో గ్రామ స్థాయి కాంగ్రెస్ నేతలు ఢీలాపడిపోయారు. పదేళ్ల నుంచి పంచాయతీలపై పట్టంతా గులాబీ నేతలదే సాగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తుండడంతో పంచాయతీలపై పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వారంతా ప్రజలతో మమేకమై.. చురగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హడావుడి అంతా వారిదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు వారిలో నిరుత్సాహం నింపాయి.
Recent Comments