Friday, September 20, 2024
Homeటాప్ స్టోరీస్జైనూరులో టెన్షన్.. టెన్షన్..

జైనూరులో టెన్షన్.. టెన్షన్..

ఉద్రికత.. కర్ఫ్యూ విధింపు..
ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్
1200 మంది పోలీసులు ప‌హారా
రంగంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌
ఆదిలాబాద్‌-కొమురం భీం జిల్లాకు నిలిచిన రాక‌పోక‌లు
మీడియాపై ఆంక్షలు

స్పాట్ వాయిస్, బ్యూరో: ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జైనూరులో ఇరు వర్గాల మ‌ధ్య జ‌రిగిన‌ ఘర్షణలు, విధ్వంసకాండ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఓ మహిళపై లైంగిక దాడి, హత్యాయత్నానికి నిరసనగా జైనూర్ బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో సుమారు వంద దుకాణాలు, కొన్ని కార్లు, ఆటోలు, మోటర్ బైకులు బూడిదయ్యాయి. దుకాణాలకు నిప్పు పెట్టడంతో గురువారం ఉదయం వరకు మంటలు ఎగిసి పడుతూనే ఉండగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌..
ఆసిఫాబాద్ జిల్లాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు వ‌క్రీక‌రించి సోష‌ల్ మీడియాలో ట్రోల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు ముందు జాగ్రత్త చ‌ర్యగా ఇంట‌ర్నేట్ సేవ‌ల‌ను బంద్ చేశారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌ బాండ్ తో పాటు అన్ని ప్రైవేటు కంపెనీల‌కు చెందిన నెట్‌ సేవలు నిలిచిపోయాయి.
జైనూరులోనే అడిషనల్ డీజీ మహేష్ భగవత్..
అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ గురువారం జైనూరులోనే మకాం వేశారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావ‌డానికి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ రేంజ్ డీఐజీ చంద్రశేఖర్, నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, ఇద్దరు సీపీలు బందోబ‌స్తు ప‌ర్యవేక్షిస్తున్నారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన 1200 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. హస్నాపూర్, నార్నూర్, జంగావ్, సిర్పూర్ యు నాలుగు కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

జైనూర్ లో ఉద్రిక్తత

శాంతి భ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగిస్తే చ‌ర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బాధితురాలికి సత్వర న్యాయం చేసేలా తమ వంతు కృషి చేస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉట్నూర్, జై నూర్, సిరిపూర్ యూ, కెరమెరి, ఆస్వాబాద్ నార్నూర్, గాదిగూడ మండలాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. మహిళా పోలీసులతో కూడిన రాపిడ్ యాక్షన్ బలగాలు జైనూర్ ఏజెన్సీలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్..
జై నూర్ మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ను ముందస్తుగా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. వీహెచ్ పీ, బీజేవైఎం నాయకులను అదిలాబాదులో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు.

రెచ్చగొట్టే ప్రక‌ట‌న‌లు చేయొద్దు..
ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు. మీడియాకు ఆంక్షలు విధించడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జ‌ర్నలిస్టులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

జైనూర్ లో కర్ఫ్యూ…

కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. ఆటో డ్రైవర్ గిరిజన మహిళపై లైంగిక దాడి ఘటనతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఘటనపై పలువురు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జైనూర్ లో బీఎన్ఎస్ఎస్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాధికారులు జైనూర్ పట్టణంలో ఇంటర్నెట్ నిషేధం కూడా విధించారు. బూటకపు వార్తలు, వదంతులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) కూడా మోహరించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది. ఒక వర్గం వారు మరో వర్గం వారిపై రాళ్ల దాడులకు పూనుకోవడం, ఆస్తులకు నష్టం కలిగించారు. ఆగస్టు 31న ఆటో డ్రైవర్(45) ఓ గిరిజన మహిళ(31)పై లైంగిక దాడికి యత్నించడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆటో డ్రైవర్ ఆమెను కర్రతో బాదడంతో ఆమె రోడ్డు మీదే స్పృహ తప్పి పడిపోయిందని సమాచారం. తర్వాత ఆమెను పోలీసులు జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని గిరిజన సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాక గిరిజన పెద్దలతో మాట్లాడుతున్నారు. ఘటనపై దర్యాప్తు జరపడానికి ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారిని శాంతియుతంగా ఉండమంటూ పోలీసులు పిలుపునిచ్చారు. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments