Saturday, November 23, 2024
Homeజనరల్ న్యూస్సంక్రాంతికి సన్నబియ్యం.. 

సంక్రాంతికి సన్నబియ్యం.. 

సంక్రాంతికి సన్నబియ్యం.. 

జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ.. 

తెలంగాణ అంతటా సబ్సిడీ ధరలకు గోధుమలు

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

పీడీఎస్ బియ్యం మళ్లింపుపై డీలర్లకు హెచ్చరిక

రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం..

స్పాట్ వాయిస్, హైదరాబాద్:  తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

పక్కదారి పట్టకుండా..

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్‌ డీలర్లను మంత్రి హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్‌ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాగా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించాయని, సరిపడా బియ్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేయగా ఉత్తమ్ కుమార్ స్పందిస్తూ సమస్య పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు.

విస్తృత ప్రచారం.. 

మహాలక్ష్మి పథకానికి సంబంధించి రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖకు విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారులందరికీ మెసేజ్‌లు పంపి బెలూన్లు, ఇతర ప్రచార సామగ్రిని వినియోగించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. చౌక ధరల దుకాణాల్లో 1,629 ఖాళీలు ఉన్నాయని మంత్రి ఆరా తీసి, వెంటనే భర్తీ చేయాలని అధికారులను కోరారు. కాగా, పలు సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంత్రికి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments