Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్బాపూ.. మాట్లాడు...

బాపూ.. మాట్లాడు…

పార్టీని కాపాడుకుంటేనే ఉనికి.. స్థానికం వరకైనా... కేసీఆర్ స్పందించేనా..?

కేసీఆర్ మౌనమెందుకో…
బిడ్డను పరామర్శించడు.., శ్రేణులకు ధైర్యం చెప్పడు..
కేడర్ లో నిరాసక్తి..
పార్టీ పలుచనవుతోందని తీవ్ర ఆవేదన..
స్థానిక పోరుకైనా బయటికొచ్చేనా..?

స్పాట్ వాయిస్, డెస్క్: 

బాపూ.. మాట్లాడవా.? ఏం పాపం చేశాం నాయినా..? ఎన్నో పుస్తకాలు చదివినోళ్లు., మరెన్నో ఆటుపోట్లు చూసినోళ్లు. మేధావి మౌనం ఎన్నో అనర్థాలకు మూలమని సందర్భం వచ్చిన ప్రతిసారి సెలవిచ్చే మీరేనా ఉలుకుపలుకు లేకుండా ఉంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది బాపు. దయచేసి నోరు విప్పు. మమ్మల్ని కాపాడు., కబంధ ‘హస్తాల’ నుంచి రక్షించు. మీ భాషలోనే చెప్పాలంటే అప్ అండ్ డౌన్స్…, కష్టసుఖాలు.., గెలుపోటములు.. అతి సహజమే కదా. అంత చెప్పిన మీరు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఎందుకు స్థిమితపడడం లేదు., మరెందుకు కాలు బయటపెట్టడం లేదు. ఇకనైనా రంగం సిద్ధం చెయ్., నీవారికి నేనున్నాననే భరోసా ఇయ్యి.

మౌనంతో భయం…
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం చవిచూసింది. కేసీఆర్ పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నైనా తట్టుకోగలిగేవాడేమోగానీ కూతురు అరెస్ట్, జైలు జీవితం గడుపుతున్న విషాదాన్ని భరించడం ఆయన వల్ల కావడం లేదని స్వయంగా ఆయన మాటల్లోనే వినిపించింది. ఎంత ఇబ్బందికర పరిస్థితులైనా స్పోర్టివ్ గా తీసుకోవాల్సింది పోయి ముఖం చాటేయడం సరికాదని శ్రేణులు అంటున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం ఓడినంత మాత్రన ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం ఏంటని కేసీఆర్ తీరును కొందరు నేతలు తప్పుబడుతున్నారు.

mlc Kavitha
kavitha


పార్టీని కాపాడుకుంటేనే ఉనికి..

కవిత జైలుకెళ్లి సుమారు 170 రోజులు కావొస్తుంది., పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడి వంద రోజులు దగ్గరకు రాబోతోంది., అయినా కేసీఆర్ ఎందుకు అక్టివ్ గా మారడం లేదో అర్థం కాక పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు. గతంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలనే అనుసరించాలని, అధికారం కోల్పోయినా కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న తీరును గమనించాలంటున్నారు. ప్రతి పక్షహోదాను పరిపూర్ణంగా పోషిస్తేనే ప్రజలు మరోమారు నమ్ముతారని, మనకెందుకులే అనుకుంటే పుట్టిమునిగిపోతుందని పేర్కొంటున్నారు. కనీసంగా అసెంబ్లీ సమావేశాల్లోనైనా పాల్గొని సర్కార్ విసిరే సవాళ్లను తిప్పికొడ్తే ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ పోతుందని సూచిస్తున్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టుగా కూతురు కవిత బెయిల్ కు పార్టీ కార్యక్రమాలకు లింక్ పెట్టుకున్నట్టుగా వ్యవహరించడం మంచిదికాదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కకపోవడంతో తీవ్ర నిస్పృహలో ఉన్నమాట గమనించదగ్గదే అయినా అదే సాకుగా ఇంటికే పరిమితం అవుతుండడంతో జనాల్లో నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలు వేగవంతం చేస్తుండడంతో బీఆర్ ఎస్ శ్రేణులకు ఇంకా మింగుడు పడని పరిస్థితి దాపురిస్తోందని పలువురు విశ్లేషకులు వాపోతున్నారు. అధినేత మౌనంగా ఉండడంతో కాంగ్రెస్ అభివృద్ధి చూసి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వలసలు పెరుగుతున్నాయనేవారు లేకపోలేదు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలను కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉందని, పార్టీని ఇంకా నిర్లక్ష్యం చేస్తే విలీనం దిశగా జారుకునే ప్రమాదం పొంచి ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.

స్థానికం వరకైనా…
కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నట్టు తెలుస్తుండడంతో పార్టీ ముఖ్యులు పెదవి విరుస్తున్నారు. కనీసం 170 రోజులుగా కూతురును కూడా పలకరించకుండా కేవలం ఇంటికే పరిమితమైన నాయకుడు జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి ఇంకెంత సమయం తీసుకుంటాడోనని అంటున్నారు. మరోవైపు స్థానిక సమరానికి ప్రభుత్వం శంఖారావం పూరించేందుకు ఉవ్విళ్లూరుతోంది. సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పటి నుంచైనా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం నింపకుంటే రాబోయే కాలంలో గ్రామస్థాయిలో పటిష్టంగా ఉన్న స్థితి నుంచి పతనానికి దారి తీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు, ఆ పార్టీ శ్రేణులే స్వయంగా పేర్కొంటున్నాయి. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తారు.., పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఎప్పుడు నింపుతాడో చూడాలి మరి…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments