Saturday, September 21, 2024
Homeటాప్ స్టోరీస్సెప్టెంబర్ 5న విచారణకు రండి..

సెప్టెంబర్ 5న విచారణకు రండి..

మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు
హరీష్ రావు సహా 8 మందికి ఇష్యూ..
జారీ చేసిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు
నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా.. బీఆర్ఎస్‌పై అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో ఏకంగా లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. డిజైన్‌తో పాటు నిర్మాణం, నిర్వహణలో లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ మేరకు.. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల బృందం కూడా ఇలాంటి నివేదిక ఇచ్చింది. దీంతో.. ప్రభుత్వం ఈ డ్యామేజీ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఓవైపు జ్యుడీషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా.. కేసీఆర్‌కు న్యాయస్థానం నుంచి నోటీసులు రావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీచేసింది. వీరితో పాటు అధికారులు స్మిత సబర్వాల్, రజత్ కుమార్ కూడా ఉన్నారు.నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. విచారణకు రావాల్సిందిగా 8 మందికి నోటీసులు జారీచేసింది.

రాజలింగమూర్తి పిటిషన్ మేరకు
నాగవెల్లి రాజలింగమూర్తి వేసిన రివిజన్ పిటిషన్ ను భూపాలపల్లి సెషన్స్ కోర్టు స్వీకరించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. గత ఏడాది అక్టోబర్ 25న మేడిగడ్డ కుంగుబాటుపై పీఎస్ లో ఫిర్యాదు నమోదు చేశానని.. తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని రాజలింగమూర్తి పిటిషన్ లో తెలిపారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుకెక్కినట్లు తెలిపారు. మొదట ఈ విషయంలో ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా.. తన పిటిషన్ ను జడ్జి కొట్టేశారని తెలిపారు. దీంతో తాను హైకోర్టుకు వెళ్లగా.. ఓ రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించిందని తెలిపారు. అందుకే తాను రివిజన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఇప్పటికే కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి సెషన్స్ కోర్టు విచారణ చేపడుతుండడంతో మేడిగడ్డ డ్యామేజ్ కేసు ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments