Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలులోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
వర్షంలో మోరంచవాగు, గణపసముద్రం చెరువు పరిశీలన 
స్పాట్ వాయిస్, గణపురం : భారీ వర్షాల నేపథ్యంలో లో తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆదివారం భారీ వర్షంలో జిల్లా కలెక్టర్ భూపాలపల్లి, గణపురం మండలాల్లో పర్యటించిన కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి వద్ద మోరంచ వాగు ఉధృతితోపాటు గణపురం మండలంలోని ఘనప సముద్రం నీటి మట్టం, మత్తడి, చెరువు కట్టను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకి రావొద్దని, పశువులను మేతకు బయట వదలకూడదని తెలిపారు. వరద ఉధృతి ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దన్నారు. గత సంవత్సరం జూలైలో మోరంచపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. మోరంచవాగు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని, వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. గణపసముద్రం చెరువు నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉందని నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. గణపసముద్రం చెరువు ద్వారా సాగవుతున్న ఆయకట్టు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్, తహసీల్దార్లు శ్రీనివాస్, మురళీధర్ రావు, ఎంపీడీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments