Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలుభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దామెర ఎస్సై కొంక అశోక్ 

స్పాట్ వాయిస్, దామెర: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎస్సై కొంక అశోక్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరదలు సంభవించే అన్ని ప్రదేశాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. పోలీస్ సిబ్బంది మండల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలన్నారు. ఎగువన కురుస్తున్న అధిక వర్షాల కారణంగా వాగుల్లో వరద క్రమేపీ పెరుగుతోందని, పరీవాహక ప్రాంతాల్లోని ముంపు ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో ఇప్పటికే వరద నీటి ఉదృతితో రాకపోకలకు ఆటంకాలు కలుగుతున్న రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశామని, ఆయా ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేశామన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి నీటితో నిండటం వలన, వాహనాల టైర్లు జారి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని సూచించారు. విపత్తుల కాలంలో ప్రజలకు సేవలందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్నవారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. పోలీసులు చేపట్టే చర్యలకు దామెర మండల ప్రజలంతా సహకరించాలని ఎస్సై కొంక అశోక్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments