ఆ రెండు జిల్లాలను వేర్వేరుగా గుర్తించాలి…
బదిలీల్లో వరంగల్, హనుమకొండ జిల్లాలపై చర్చ
రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిప్రతాలు
పరిశీలించాలంటున్న సీనియర్ అసిస్టెంట్లు
స్పాట్ వాయిస్, బ్యూరో : ఉద్యోగుల సాధారణ బదిలీల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు జిల్లాలు భద్రాద్రి జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్‌లో ఇంకా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలు కూడా వున్నాయి. ప్రస్తుత బదిలీల్లో హనుమకొండ, వరంగల్ జిల్లా కేంద్రాలను ఒకే యూనిట్‌గా పరిగణించి, ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లను (జోనల్ పోస్టు) మిగిలిన మూడు జిల్లాలకు బదిలీ చేస్తారని జరుగుతున్న ప్రచారం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు జిల్లా కేంద్రాలు నగర పరిధిలో ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
అయితే హనుమకొండ, వరంగల్ జిల్లా పాలన, అధికార యంత్రాంగం వేర్వేరుగా ఉన్నందున రెండింటిని వేర్వేరుగానే పరిగణించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. స్టేషన్ సీనియారిటీ ప్రకారం రెండు జిల్లాల ఉద్యోగులు హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై టీఎన్జీవో సంఘం నేతల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు తమ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వినతిప్రతాలు సమర్పిస్తున్నారు. మెడికల్, రెవెన్యూ శాఖల్లో ఇందుకు సానుకూలమైన స్పందన వ్యక్తమైనట్టు చెబుతున్నారు. అయితే పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఈ విషయమై ఇంకా అస్పష్టత నెలకొంది. హనుమకొండ వారు వరంగల్‌కు, వరంగల్ వారు హనుమకొండకు బదిలీ పొందే అవకాశం కల్పించాలని కొందరు ఉద్యోగులు ఇటీవల ఆర్జేడీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ఇంకా ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి వుంది.
ఇదిలావుండగా, తమ సర్వీసు అంతా వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లోనే కొనసాగడంతో ఇక్కడే స్థిరపడ్డామని, ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని వారిని ఆ రెండు జిల్లాల్లో, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని వారిని ఆ మూడు జిల్లాల్లోనే సర్దుబాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీనియర్ అసిస్టెంటు పోస్టులు రెండేళ్ల క్రితం వరకు జిల్లా స్థాయి కేడర్‌లో ఉన్నందున ఉద్యోగులందరూ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్థిరపడ్డారని, ఇప్పుడు జోన్ పరిధిలోకి మార్చినందున ఇతర జిల్లాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
విద్యాశాఖలో జోన్‌ల వారీగా అతి తక్కువ ఉద్యోగులు బదిలీలకు అర్హులుగా ఉన్నందున ఇబ్బందులకు లోనుకాకుండా బదిలీ చేయాలని కోరుతున్నారు. ఖమ్మం నుంచి వరంగల్‌కు, వరంగల్‌నుంచి ఖమ్మంకు అనేక మంది అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నారని, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్లో స్వల్ప మార్పులు చేయాలని వారు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోనే సర్దుబాటు చేయడం వల్ల 90శాతం సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేయగలుగుతారని చెబుతున్నారు. ఆప్షన్లను ఎంచుకోవడంలో మహిళలకు, కేడర్ సీనియారిటీకి ప్రాధాన్యం కల్పించాలని విన్నవిస్తున్నారు.
Recent Comments