Friday, September 20, 2024
Homeతెలంగాణకడియం ఆశలు గల్లంతేనా..?

కడియం ఆశలు గల్లంతేనా..?

వలస వచ్చినోళ్లకు  మంత్రివర్గంలో నో ఛాన్స్..
కాంగ్రెస్ బీఫాంతో గెలిచినోళ్లకేనంటూ సీఎం వ్యాఖ్యలు
మూసుకుపోయిన కెబినెట్ దారులు..

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన వారికే కేబినెట్ లో చోటు అంటూ సీఎం వ్యాఖ్యలు చేయడంతో.. కడియంకు మంత్రి వర్గం దారులు మూసుకుపోయాయి. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కూతురుకు ఎంపీ టికెట్ తోపాటు, మంత్రి పదవి హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి సైతం కడియం శ్రీహరికి రాజకీయంలో అపార అనుభవం ఉందని, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందనే చర్చ, ఆశలు మొదలయ్యాయి. అయితే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించగా.. కాంగ్రెస్‌ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని  స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్‌ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్టం చేశారు.

నీటిపారుదల లేదా విద్యాశాఖ..
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అనేక రంగాలపై అనుభవం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో ఇటు బీఆర్ఎస్ సర్కార్ లోనూ మంత్రిగా పని చేశారు. దీంతో కడియం శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు దక్కితే నీటిపారుదల శాఖ లేకపోతే విద్యాశాఖ కేటాయిస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారికే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు దక్కదనే అంశం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఇక ఇప్పటికే ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళ మంత్రులు ఉండగా.. కడియంకు అవకాశం ఇస్తే ఒకరికి మంత్రి పదవి ఊడుతుందనే చర్చ కూడా సాగింది. అయితే ఇప్పుడు కడియం అవకాశం లేకపోవడంతో.. మహిళ మంత్రులు ఇద్దరు సెఫ్ జోన్ లోనే ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments