తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్..
నిజాయితీ నిరూపించుకునేందుకు వాడుతున్న నేతలు
గతంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి..
తాజాగా పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. తటిబట్టతో ప్రమాణాలు ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ప్రత్యర్థులపై సవాళ్లు చేయటమే కాదు.. వాటిని స్వీకరిస్తున్నారు. అందులోనూ.. దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్న సవాళ్లు ఎక్కువగా వినిపిస్తుండగా.. వాటిని స్వీకరిస్తున్న నేతలు తడిబట్టలతో దైవం సాక్షిగా ప్రమాణాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ లిస్టులో ఇప్పటికే… బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఉండగా.. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి కూడా చేరారు.
స్పాట్ వాయిస్, కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య అవినీతి ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. వీరి మధ్య మాటలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ఆలయాలలో ప్రమాణాలు చేసే దాకా వెళ్లింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లైయాష్ తరలింపులో 100 కోట్లు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఓవర్ లోడ్ లారీలను కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడుతున్నట్టు కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక ఫ్లైయాష్ విషయంపై తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ నోటీసులు ఇచ్చారు. దీనికి తోడు హుజూరాబాద్ కాంగ్రెస్ నేత ప్రణవ్ కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరుతోను డబ్బులు వసూలు చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. పాడి కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తామని ప్రణవ్ సవాల్ విసిరారు. ఈ సవాల్ ని స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి తాను ఎటువంటి అవినీతి చేయలేదని, హుజూరాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నానని పేర్కొన్నారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఉదయం 11గంటలకు హనుమాన్ టెంపుల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఇటు అటు కాంగ్రెస్ నేత ప్రణవ్‌ను కూడా సింగాపురంలో నిర్బంధించారు. మరోవైపు చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇక హౌస్ అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఫొటో పెట్టుకుని దేవుడు సాక్షిగా మీరు చేసిన సవాల్ కు నా నిజాయితీని నిరూపించుకునేందుకు తడి బట్టలతో ప్రమాణం చేస్తున్నానని ఇంటి వద్దనే ప్రమాణం చేశారు. దీంతో హుజూరాబాద్ రాజకీయం హాట్ హాట్ గా మారింది.
పొన్నంకు సవాల్..
నేను ఎక్కడ అవినీతి చేయలేదు.. చేసే అవసరం కూడా నాకు లేదు.. చెయ్యనని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ చేస్తున్నానని బుధవారం 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి తన సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో అన్నారు. ఒకవేళ నువ్వు రాకపోతే అన్ని స్కామ్ లు చేసినట్టేనని, అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలను దోచుకున్నావని ఒప్పుకున్నట్టేనని పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.
గతంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే.. గతంలో బండి సంజయ్ కూడా.. యాదాద్రి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారగా.. సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రం చేసిందంటూ గులాబీ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల ప్రమేయం లేదని.. యాదాద్రికి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. తడిబట్టలతో గర్భగుడి ముందు నిల్చొడి బండి సంజయ్ ప్రమాణం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి.. కంట’తడి’ పెట్టుకుని ప్రమాణం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ నుంచి కాంగ్రెస్ ముడుపులు తీసుకుందంటూ మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు చేయగా.. వాటిపై స్పందించిన రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.
Recent Comments