జూలై2న మంత్రివర్గ విస్తరణ..
ఆరుగురికి అవకాశం..
వరంగల్ నుంచి కడియంకు బెర్త్..!
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
తలనొప్పిగా మారిన నామినేటెడ్ పోస్టులు
స్పాట్ వాయిస్, బ్యూరో: మంత్రి వర్గ విస్తరణకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే నెల 2వ తేదీన కెబినెట్ విస్తరణకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పయనమవుతున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్ఠానంతో మరోసారి చర్చించే అవకాశం ఉంది. తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ జూలై2వ తేదీన వాకాటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలకు బలం చేకూరింది.
పని తీరును అంచనా వేసి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ నేటికీ విస్తరించలేదు. నాయకుల పని తీరు.. పార్టీపై విధేయతను అంచనా వేసిన అనంతరం ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇన్ని రోజులు వేచి చూసిన సీఎం ఇప్పుడు విస్తరణ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అందరూ ఆశావహులే..
కేబినెట్ లో కొత్తగా ఆరుగురికి బెర్త్ దక్కనుంది. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది. 6 మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీకి, మరొకటి మైనారిటీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాల నుంచి సమాచారం. కీలకమైన హోం శాఖను బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే పోటీ పడుతున్న నలుగురు రెడ్డి సామాజికవర్గ నాయకుల్లో ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది. మరో ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్, ఇంకొకరు ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక మిగిలిన రెండింటిలో ఒకటి లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇంకో మంత్రి పదవి మైనారిటీలకు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ, ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న ధోరణిలో రాష్ట్ర నాయకత్వం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
కడియంకు ఛాన్స్..
మంత్రి వర్గ విస్తరణలో వరంగల్ జిల్లాలకు మరో మంత్రి పదవి దక్కనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ ఉండగా.. ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చి సీనియర్ లీడర్ కడియం శ్రీహరికి సైతం విస్తరణలో అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచారంలో కడియం అనుభవాన్ని వాడుకుంటామని చెప్పారు. అంతేకాకుండా కడియం శ్రీహరి టీడీపీలో మంత్రిగా, ఇటు బీఆర్ఎస్ లో డిప్యూటీసీఎంగా, మంత్రిగా పని చేశారు. అలాగే అపార అనుభవం, సబ్జెక్ట్ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఈనేపథ్యంలోనే ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, లేదా విద్యాశాఖ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
తలనొప్పిగా మారిన నామినేటెడ్ పోస్టులు..
లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రకటించిన నామినేటెడ్ పదవులు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. కొన్నింటిపై కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అలాగే ఎంపీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మార్పులు చేర్పులు చెయ్యాలన్న యోచనతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 37 నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని తొలిగించాల్సి వస్తే, వాటి స్థానంలో పార్టీ కోసం కస్టపడి పని చేసిన, చేస్తున్న వారిని చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
Recent Comments