మండుటెండలో పండుటాకు నిరసన
మందు డబ్బాతో రోడ్డుపై ధర్నా
ఓ పోలీస్ ఆఫీసర్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇవ్వలేదంటూ ఆవేదన
న్యాయం చేయాలంటూ వేడుకున్న వృద్ధుడు
టేకుమట్ల మండలంలో ఘటన
స్పాట్ వాయిస్, టేకుమట్ల: తమ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇవ్వకుండా ఓ పోలీస్ ఉన్నతాధికారి బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధుడు మందు డబ్బాతో తన బంధువులతో కలిసి ఎండలో రోడ్డుపై నిరసనకు దిగాడు. అ వృద్ధుడి బాధను చూసిన మండల రైతులు సైతం అతడికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వృద్ధుడు, గ్రామస్తులు, పెద్దమనుషులు చెప్పిన వివరాల ప్రకారం.. టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఇటుకాల రాయమల్లు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1 లో తనకున్న 39 గుంటల భూమిని (14లక్షలకు ఎకరం చొప్పున మొత్తం 13లక్షల 65 వేలకు ) అదే గ్రామానికి గజ్జి కృష్ణ తన భార్య రాధిక రాణి పేరున కొనేందుకు ( ప్రస్తుతం పెద్దపల్లి ఏసీపీ గా విధులు నిర్వహిస్తున్నారు) ఒప్పందం జరిగింది. రూ.7 లక్షలు కట్టి, రిజిస్ట్రేషన్ అప్పుడు 6లక్షల 65 వేలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒప్పందం. అయితే రిజిస్ట్రేషన్ రోజు గ్రామస్తుడు డబ్బులు కట్టమంటే, నీకు ఎట్ల కనపడుతాన అంటూ.. యూస్ లెస్ ఫెలో అంటూ బూతులు తిడుతూ.. కారులో తన భార్య వద్ద ఉన్న డబ్బుల బ్యాగ్ తీసి చూపించారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇస్తా అని చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ మోసం చేస్తాడా అనే ధీమాతో వృద్ధుడు రిజిస్ట్రేషన్ చేశాడు. తర్వాత అక్కడ కాదు ఇంటి వద్ద ఇస్తామని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బోరు రిపేర్ చేస్తేనే ఇస్తానని, అంతవరకు ఇవ్వనని కిటుకు పెట్టి వెళ్లిపోయాడు. బోర్ రిపేర్ అని కాగితం రాసుకోలేదని, తన డబ్బులు తనకు కావాలని ఏసీపీ ఇంటికి పెద్దమనుషులతో వెళ్లి అడిగాడు. దీంతో లోన్ డబ్బులు రాగానే ఇస్తానని చెప్పి, తర్వాత తన ఇంటికి ఎందుకు వస్తున్నారని మా పేరు మీదకు భూమి వచ్చింది ఎక్కడ చెప్పుకుంటవో చెప్పుకోపోండి అంటూ దబాయించాడన్నారు. ఇదే విషయం టేకుమట్ల పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును సైతం కలిసి తమ గోడును వెల్లబోసుకోగా న్యాయం జరగలేదు. దీంతో తనకు చావే దిక్కు అంటూ ఆ వృద్ధుడు మందు డబ్బాతో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు. టేకుమట్ల ఏ ఎస్సై కుమారస్వామి వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులను శాంతింప చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మొత్తం డబ్బు కట్టాం..
ఇదే విషయంపై ఏసీపీ భార్య బండారి రాధిక రాణి వివరణ ఇచ్చారు. తాను ఇటుకల రాజమల్లు % నరసయ్య ఆరేపల్లి గ్రామస్తుడి నుంచి గతేడాది 0.39 గుంటల భూమి కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు. రూ.13,65,000 పెద్దల సమక్షంలో వాయిదాల ప్రకారం డబ్బులు కట్టామని చెప్పారు. ఆ తర్వాతనే ఇటికాల రాజమల్లు % నరసయ్య భూమి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. కానీ కొంతమంది తమ కులస్తులు, పాలివాళ్లు మా ఎదుగుదలను ఓర్వలేకటేకుమట్ల సెంటర్లో రాజమల్లు ఆధ్వర్యంలో తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక ప్రకటన లో తెలిపారు. డబ్బులు ఇవ్వలేదనేది వాస్తవం కాదన్నారు.
Recent Comments