స్పాట్ వాయిస్, డెస్క్: బెంగళూరులోని నగర శివారు ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ సహాయ నటి హేమ ఉన్నట్లు బెంగళూరు నగర్ పోలీస్ కమిషనర్ బి. దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల ప్రమేయం మాత్రం లేదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. సీసీబీ పోలీసులు, స్థానిక పోలీసులు నగర శివారు ప్రాంతంలో పార్టీ జరుగుతుందని తెలిసి దాడులు నిర్వహించారని తెలిపారు. మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్ సహాయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పార్టీలో వంద మందికి పైగా పాల్గొన్నారు. ఈ దాడిలో మత్తు పదార్థాలను గుర్తించామన్నారు. కొందరు తాము వాడుతున్న డ్రగ్స్‌ను స్విమ్మింగ్ పూల్తో పాటు ఇతర ప్రాంతాల్లో విసిరేశారని వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. రేవ్ పార్టీలో తాను లేనని సహాయ నటి హేమ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి ఆమె తీశారో తెలియడం లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ అన్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Recent Comments