Sunday, November 24, 2024
Homeరాజకీయంఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కేనో..?

ఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కేనో..?

ఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కేనో..?

హోరాహోరీగా మూడు పార్టీల ప్రచారం..

చాలెంజ్ గా తీసుకున్న బీఆర్ఎస్..

అధికార బలంతో కాంగ్రెస్

మండలిపై ఫోకస్ చేసిన బీజేపీ

స్పాట్ వాయిస్, బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీ పడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలో నిలిచారు.

బీఆర్ఎస్ కు ప్రెస్టేజ్ గా ఇష్యూ

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయిన నాటినుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కోపతాపాలుంటే పక్కకు పెట్టాలని, పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అసంతృప్తులతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. యువత, ఉద్యోగుల్లో క్రేజ్ ఉన్న యువ నాయకుడు కేటీఆర్ కావడంతో ఆయన ఓటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ.. విజయానికి బాటలు వేస్తున్నారు.

బీజేపీ ఫోకస్

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం కోసం తహతహలాడుతోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గళం వినిపించేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని, మోడీ సర్కార్ యువత, ఉద్యోగుల కోసం ఎంతో చేసిందంటూ చెప్పుకొస్తున్నారు.

అధికార బలంతో కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో పాటు ఖమ్మం – నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మార్నింగ్ వాక్ లు, యువతతో మీటింగ్ లు నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. మొత్తంగా మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు సాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments