ఆస్తి కోసం తాతను చంపిన మనవళ్లు..
హన్మకొండ జిల్లాలో దారుణం..
స్పాట్ వాయిస్, క్రైం: ఆస్తి కోసం మనవళ్లు తాతను హత్య చేసిన ఘటన హన్మకొండ జిల్లా హసన్ పర్తిలో చేటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జవ్వాజీ సురేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య (80) పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు జల్లి రమేశ్, జల్లి అశోక్, కూతురు తిరుమల ఉన్నారు. వీరిలో చిన్న కొడుకు అశోక్ చిన్నతనంలోనే చనిపోగా, పెద్ద కుమారుడు రమేశ్ వివాహమైన తర్వాత చనిపోయాడు. రమేశ్‌కు భార్య రమాదేవి, ముగ్గురు కుమారులు రాకేశ్, సాయికృష్ణ, శశికుమార్ ఉన్నారు. రాకేశ్ వాళ్ల అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. సాయికృష్ణ, శశికుమార్ సారయ్య ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. అయితే తన ఆస్తిలో మనవళ్లతోపాటు కూతురికి కూడా వాటా ఇవ్వాలని సారయ్య నిర్ణయించాడు. ఈ విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. తమకే మొత్తం ఆస్తి కావాలని, కోడలు రమాదేవి, మనువళ్లు సాయికృష్ణ, శశికుమార్ సారయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సారయ్య ముఖం కడుక్కుంటుండగా వాకింగ్ స్టాండ్‌తో ఆయన తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయమడంతో సారయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. సారయ్య కూతురు తిరుమల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Recent Comments