చేతిలో రూ.52,920 నగదు మాత్రమే ఉన్నాయట..
ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రధాని
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. అందులో తన పెట్టుబడులు, స్థిర, చరాస్తులను డిక్లేర్ చేశారు. రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 2014లో మోదీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే 2019లో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2014లో తన ఆస్తి విలువ రూ1.66 కోట్లు ఉన్నట్టు ఆయన డిక్లేర్ చేశారు. 2019లో అది రూ.2.51 కోట్లకు పెరిగినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ గణాంకాలు వెల్లడిస్తు్న్నాయి. కాగా, తాజాగా ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం, రూ.2.67 లక్షలు విలువచేసే నాలుగు బంగారు ఉంగరాలు (ఇన్వెస్ట్‌మెంట్స్) ఉన్నాయి. అదనంగా, రూ.9.12 లక్షలు విలువచేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్‌సీ) ఉన్నాయి. ఎన్‌ఎస్‌సీలో ఆయన పెట్టుబడి 2019లో 7.61 లక్షల నుంచి సుమారు రెండు లక్షలు పెరిగింది. దీనికితోడు, రూ.2.85 కోట్లు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు 2024 అఫిడవిట్ తెలిపింది. అయితే, ప్రధానికి ఎలాంటి భూములు కానీ, ఇల్లు, కారు, షేర్లు, మ్యూచువల్ పండ్స్‌లో పెట్టుబడులు లేవు. ఆయన చేతిలో రూ.52,920 నగదు మాత్రమే ఉంది. ప్రభుత్వ జీతం, బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోడీ ప్రకటించారు. తన భార్య ఆదాయమార్గాలు తనకు తెలియవని ఆయన తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అలాగే, తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ, ప్రభుత్వ బకాయిలు కానీ లేవని ఆయన ప్రకటించారు.
Recent Comments