ఎన్ఎస్ఆర్, ఆస్పత్రులకు బెదిరింపు లేఖలు
స్పాట్ వాయిస్, క్రైం : నక్సలైట్లమని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని హన్మకొండ, సీసీస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ సీపీఐ మావోయిస్ట్ కమాండర్ దేవన్న పేరున వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రీకాంత్(25), వరంగల్ కరీమాబాద్ కు చెందిన బాలిని మహేశ్ (31) ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారికి, అజర హాస్పిటల్, దీపక్ స్కిన్ క్లినిక్ హాస్పిటల్స్ కు లెటర్లు ఇచ్చారు. పాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని ఎన్ఎస్ఆర్ గ్రూప్, హాస్పిటల్ వారిని ఆస్తుల వివరాలు, భూమి పత్రాలు ఇంటి స్థల పత్రాలు హాస్పిటల్ లైసెన్సు, డబ్బులు పట్టుకొని చర్చకు రావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈడీ, సీబీఐకి పట్టిస్తామని లేకుంటే నక్సలైట్ చేతిలో చచ్చిపోతారని బెదిరించారు. దీంతో వారు పోలీస్ స్టేషన్ పరిదిలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మంగళవారం ములుగు రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా వారిని పట్టుకుని, విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడించారు.
Recent Comments