తల్లి రాకకోసం భక్తుల చూపు..
నేడే సమ్మక్క ఆగమనం..
స్పాట్ వాయిస్/మేడారం: ఆదివాసీల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం సమ్మక్క రాకకోసం భక్తులంతా తన్మయత్వంతో ఎదురుచూస్తున్నారు. మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. తమ ఇంటి ఇలవేల్పు సమ్మక్క రాకతో తమ బాధలు, కన్నీళ్లు తొలగిపోతాయనే ప్రగాఢ విశ్వాసంతో తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు వేచిచూస్తున్నారు. గురువారం చిలుకల గుట్ట నుంచి పూజారులు సమ్మక్క తల్లిని తీసుకువచ్చేందుకు సమాయత్తమయ్యారు. మేడారంలోని సమ్మక్క గుడిని బుధవారం సమ్మక్క పూజారుల కుటుంబ సభ్యులు శుద్ధి చేశారు. చిలుకల గట్టు నుంచి తల్లి వస్తుండటంతో తమ ఆరాధ్య దైవమైన సమ్మక్క కొలువుదీరే గద్దెలను శుద్ధి చేయడంతో పాటు అందంగా అలంకరించారు. సమ్మక్కను తీసుకువచ్చేందుకు అవసరమైన అధికార లాంఛనాలను ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది.
జన దేవతకు జేజేలు..
చిలకల గుట్టపై కుంకమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వస్తుంది. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మార్మోగుతుంటే నేరుగా గద్దెలపైకి చేరుతుంది. సమ్మక్క గద్దెలపైకి రాగానే జిల్లా ఎస్పీ గౌరవసూచకంగా గాల్లో కాల్పులు జరపుతారు. ఇక సమ్మక్క రాకతో జాతరలో అసలైన సందడి కనిపిస్తుంది. జాతరలో మూడోరోజు శుక్రవారం గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు మొక్కులు. మొక్కులు చెల్లించుకునేందుకు పోటీపడతారు.
Recent Comments