శుక్రవారం నుంచి బ్యారేజీలో భారీగా లీకులు..
నీటిని ఖాళీ చేయాల్సిందేనంట
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన
ఇక కాళేశ్వరం నిరూపయోగమేనట..
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్..
స్పాట్ వాయిస్, బ్యూరో: అన్నారం బ్యారేజీ నుంచి లీకులు మొదలయ్యాయని, శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నారం బ్యారేజీ నుంచి లీకులు భారీగా ప్రారంభమయ్యాయని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పిలిచామని చెప్పారు. వారు అన్నారంలో నీళ్లు ఖాళీ చేయాలని తెలిపారని వివరించారు. మేడిగడ్డ మాదిరిగా అన్నారం కుంగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు నింపలేమని, వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ ఇక నిరూపయోగమేనని మంత్రి అన్నారు. డిజైన్, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని చెప్పారు. వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని మండిపడ్డారు. స్వాతంత్య్ర భారతంలో నీటి పారుదల రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
నిర్వహణ లేకే..
పర్యవేక్షణ, నిర్వహణ సరిగా చేయకపోవడం, నిర్లక్ష్యం వల్లే ఆనకట్ట పియర్స్ దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. మేడిగడ్డకు వాడిన సాంకేతిక సామగ్రినే అన్నారం, సుందిళ్లకు వాడారని, అన్నారం, సుందిళ్లను నీటితో నింపవద్దని ప్రభుత్వానికి ఎన్‌డీఎస్‌ఏ సలహా ఇచ్చిందన్నారు. గతంలో నీటి పారుదల శాఖ నిర్వహణ చూసిన వారు ఈ ఘటనతో తలదించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాగ్ కూడా పరిశీలించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. దేశం, రాష్ట్రం అవాక్కయ్యే విషయాలను కాగ్ రిపోర్టులో పొందుపరిచారని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గతంలోనే లీకులు..
మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగిన 10 రోజుల తర్వాతనే అన్నారం (కేఎల్‌ఐఎస్) వద్ద రెండు గేట్ల మధ్యలో లీకేజీ కారణంగా నీరు బుడగలు బుడగలుగా బయటకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు కలకలం రేపింది.
Recent Comments