కొలిక్కి వచ్చినట్టే..!
బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్
సమావేశమైన రాష్ట్ర పెద్దలు
ఆశావహులు, గెలుపు ఛాన్స్ లపై చర్చ
డబుల్ డిజిట్ టార్గెట్ గా అడుగులు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో రెండోస్థానంలో ఉండడం, గతంలో కన్న ఎమ్మెల్యే సంఖ్య పెరగడంతో పాటు.. ఓవరాల్ గా బీజేపీకి ఓటు బ్యాంకు పెరగడంతో అధిష్టానం ఇక్కడ పాగా వేయాలనే ముందస్తు ప్లాన్ రెడీ చేసుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు అంకెల స్థానాలను కైవసం చేసుకునే స్కెచ్ తో ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్‌తో అడుగులు వేస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది. ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు.. సర్వే రిపోర్ట్ లు ఎలా ఉన్నాయని సమీక్షించారు. ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎవరెవరికంటే..
ప్రస్తుతం మూడు సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల పేర్లను ఫస్ట్ లిస్టులనే ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజమాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ , కరీంనగర్ నుంచి బండి సంజయ్ అదే స్థానాలనుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్య , మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం కన్పిస్తోంది. హైదరాబాద్ నుంచి మాధవీలత పేరు వినిపిస్తుండగా.. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, నల్గొండ , ఖమ్మం, జహీరాబాద్ నియోజక వర్గాలలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో వేచి చూస్తున్నారు. ఇక మహబూబాబాద్ సీటు కోసం ఒక బీఆర్ఎస్ నేత, ఒక కాంగ్రెస్ బడా నేత బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక వరంగల్‌లో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ముందు వరసలో ఉండగా.. ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరే అవకాశం ఉందని, అయితే అయనకు, కుదరకుంటే ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వొచ్చంటున్నారు. జహీరాబాద్ విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ టచ్ లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేరు ముందు వరసలో ఉంది. జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ సైతం ఆ స్థానం కోసం పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మల్కాజ్ గిరి పై ఈటల రాజేందర్ పట్టు పడుతుండగా.. చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ సైతం తమకు కావాలని అధిష్టానం వద్ద అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. మెదక్, నల్గొండ టికెట్లతో పాటు ఖమ్మం, ఆదిలాబాద్ టిక్కెట్ల కోసం తీవ్ర చర్చజరిగినట్లు తెలిసింది. అయితే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ ప్రకారం పేర్లు ప్రకటించాలనుకుంటున్నా… గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.
Recent Comments