Saturday, November 23, 2024
Homeతెలంగాణటచ్ చేసి చూడు..

టచ్ చేసి చూడు..

నీ వల్ల నా పార్టీకి ఏమీ కాదు..
నీకంటే హేమా హేమీలనే చూశా..
కాంగ్రెస్ సర్కార్ కు తెలివి లేదు..
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్ ఘాటు స్పందన
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. కేసీఆర్ రాజకీయాల్లో యాక్టీవ్ కావడంతో బీఆర్ఎస్ నూతనోత్తేజంతో విమర్శలు గుప్పిస్తోంది. మంగళవారం తెలంగాణ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని కేసీఆర్.. తొలిసారిగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను .. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు… నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది.. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం… దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కి పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను… మున్ముందు ఏందో చూద్దాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జలాలపై అవగాహన లేదు..

కేంద్రానికి రాష్ట్ర ప్రాజెక్టుల అప్పగింత, కృష్ణా గోదావరి జలాల కేటాయింపుల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత సర్కారుకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రాజెక్ట్ లపై ప్రజల్లో నెలకొన్న అపోహలకు క్లారిటీ ఇచ్చేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. పార్టీలోని ముఖ్య నేతలతో పాటు.. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా.. త్వరలో నిర్వహించబోయే కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై గులాబీ బాస్ సమీక్షించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే రాష్ట్రం అడుక్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో.. ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రానికి ఎప్పుడూ తలొగ్గలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బెదిరించినా.. అవసరమైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం తప్ప ప్రాజెక్టులను అప్పగించమని తెగేసి చెప్పామన్నారు. కావాలంటే.. రాష్ట్రపతి పాలన పెట్టుకో కానీ ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని చెప్పినట్టు గుర్తు చేశారు. ఎంతో మంది హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమ పార్టీకి ఉందని.. బీఆర్ఎస్‌ను టచ్ చేయటం ఎవరి తరం కాదన్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని.. ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమని.. గులాబీ బాస్ వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారుకు తెలివి లేదని.. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. ఈ విషయం మీద.. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. సభను ఏర్పాటు చేసి తీరుతామని.. నిజానిజాలు ప్రజలకు చెప్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతామన్నారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నా కేసీఆర్… ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments