బీఆర్ఎస్ కి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ గుడ్ బై!?
• కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజయ్య
• ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు
• లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాక్..
• ఆయన బాటలోనే మరికొంత మంది..
స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్ పూర్ :శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలోభారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఆయన ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది.ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అయితే ఆయన బాటలోనే మరికొంత మంది బీఆరెస్ నాయకులు హస్తం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి..కాగా స్టేషన్ ఘంపూర్ నియోజక వర్గానికి చెందిన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు పెద్ద ఎత్తున రాజయ్య వెంట కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది..కాగా ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం… రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెపుతున్నప్పటికీ… వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.
Recent Comments