చాక్లెట్ ఫ్లేవర్..?!
అడ్డాల్లో గంజా వాసనలు…?
వరంగల్ లో అమ్మకాలపై అనుమానాలు..
గతంలో పలు ప్రధాన చోట్ల పట్టుబడిన దాఖలాలు..
ప్రత్యేక దృష్టి సారించాలంటున్న ప్రజలు..
రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్ల విక్రయం..
చాక్లెట్ ఫ్లేవర్ మన నగరానికి పాకిందా..? ఆయా చోట్ల పట్టుబడుతున్న ముఠాల అతుకులు ఇక్కడా ఉన్నాయా..? చాక్లెట్ల వ్యవహారం చాపకింద నీరులా సాగుతున్నదా..? అనే అనుమానాలు గ్రేటర్ వరంగల్ వాసులను తొలుస్తోంది. రాష్ట్రమంతా గంజాయి అమ్మకాలు.., పట్టుబడుతున్న నిందితుల ఉదంతాలు వెలుగు చూస్తున్న తరుణం.., మహా నగరానికి కూడా గతంలో ఆ వాసనలు పీల్చిన అనుభవాలు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి అటు మళ్లేలా చేస్తోంది. వరంగల్ నగరంలోని పలు హాస్టళ్లు, రైల్వేస్టేషన్ అడ్డాలు., ఆయా విద్యాసంస్థల పరిసరాల్లో గతం తాలూకు మత్తు ఆనవాళ్లను గుర్తు చేస్తోంది. ఇంత పెద్ద నగరంలో ఆ మహమ్మారి ఛాయలు ఎలా పాకుతున్నాయో అర్థం గాక పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రై సిటీలోని కొన్ని ఏరియాల్లో నిరంతర మద్యం అమ్మకాల అనుభవాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇప్పుడు ఈ చాక్లెట్ల దందా యువతను ఎంత పతనం చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
–స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్
మత్తు గుట్టు చప్పుడు కాకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్లినట్టే అది అమ్మే వాసనలు కూడా అంత తేలిగ్గా బయటపడే అవకాశాలు ఉండవు. గ్రేటర్ వరంగల్ లో గంజాయి అమ్మకాలు., పట్టుబడిన సందర్భాలు పదుల సంఖ్యలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రమంతా గంజాయి చాక్లెట్ల అమ్మకాలు., నిందితులు పట్టుబడుతున్న దాఖలాలలో హాట్ హాట్ గా మారింది. రోజుకొక చోట గంజాయి చాక్లెట్లు అమ్ముతూ చిక్కినట్టు., తరలిస్తూ పట్టుబడినట్టు.., వదిలేసి పారిపోయినట్టు వార్తలు వెలువడుతున్న సందర్భంలో వరంగల్ లో కూడా వాటి తాలూకు ఆనవాళ్లు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ లో గంజా అమ్మకాలపై అనుమానాలు..
వరంగల్ మహానగరం గతంలో గంజాయి అమ్మకాల జరుపుతూ పట్టుబడిన ఘటనలు చూసిన దాఖలాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి చదువు కోసం వచ్చిన యువత., ఉపాధి కోసం వచ్చిన కార్మికులు.., వ్యాపార నిమిత్తం వచ్చిన వారే లక్ష్యంగా పలువురు గంజాయిని కూడా ఇక్కడకు తీసుకొచ్చి అమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నగరంలోని పలు ఏరియాల్లో గంజాయి విక్రయాలకు కేరాఫ్ గా ఉందనే విషయం కూడా స్థానికులు తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల పరిసరాలు., నిట్ ఏరియా.., కేయూ చుట్టుపక్కల ప్రాంతాలు., నయీంనగర్ లోని పలు హాస్టళ్లు అనుమానాలకు కేంద్రబిందువులుగా పేరు మోశాయి. అవీ కాకుండా ప్రధానంగా పలు లేబర్ అడ్డాలు.., కొన్ని వాహనాల పార్కింగ్ ఏరియాలు.., ఆటో స్టాండ్ల పరిసరాలు కూడా అనుమానించదగ్గవిగా చెప్పొచ్చు.
గతంలో పలు ప్రధాన చోట్ల పట్టుబడిన దాఖలాలు..
హన్మకొండలోని నయీంనగర్ వందల సంఖ్యలో హాస్టళ్లకు కేరాఫ్. చదువు కోసం ఎక్కడెక్కడి నుంచో యువత ఇక్కడకు వచ్చి షెల్టర్ తీసుకుని విద్యాభ్యాసం చేస్తుంటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే కొన్ని దుష్ట శక్తులు యువతకు వ్యసనాలు అలవాటు చేసి వారిని పెడదారికి మళ్లించి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గతంలో కొన్ని హాస్టళ్లలో గంజాయి ప్యాకెట్లు లభ్యమైన ఉదంతాలే అందుకు చక్కని ఉదాహరణ. తెలిసీ తెలియని తనం.., చెడు వ్యసనాలకు ఇట్టే ఆకర్షితులయ్యే వయస్సు కావడంతో విద్యా కేంద్రాలే అడ్డాలుగా మాదకద్రవ్యాల అమ్మకాలు సాగిస్తూ తమ దందాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కానిస్తున్నారు.
అలాగే కొన్ని లేబర్ అడ్డాల్లో కూడా గంజా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్టు సమాచారం. పనుల కోసం ఉదయాన్నే అడ్డాకు చేరుకున్న కార్మికులు పని లభ్యమయ్యే వరకు ఎదురు చూడడం., లేదంటే అక్కడే కాచుక్కూర్చున్న మత్తును ఆస్వాదించి తూగడం తరుచూ కనిపిస్తున్న దృశ్యాలే. వీటికి తోడు కొన్ని వాహన పార్కింగ్ ప్రాంతాలు., ఆటో స్టాండ్ పరిసరాలు కూడా మత్తుకు కేరాఫ్ గా మారినట్టు సమాచారం.
ప్రత్యేక చొరవ తీసుకోవాలి..
నగరంలో గంజాయి చాక్లెట్ల కదలికలపై పోలీసులు నజర్ సారించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ సర్కార్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూడా వాటి చాయలు కనిపించకుండా చేయాలని కోరుతున్నారు. ఆయా ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచాలని, యువత కదలికలపై, పలు కీలకమైన అడ్డాలపై ఫోకస్ పెట్టాలని వేడుకుంటున్నారు.
Recent Comments