హస్తం వ్యూహం పని చేసింది..
బీఆర్ఎసోళ్లు విష ప్రచారాన్ని తిప్పికొట్టలే..
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీఆర్ఎస్ ఓటమిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కసితో పని చేయడం వల్లే ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం పని చేసిందన్నారు. హంటర్ రోడ్డులోని సీఎస్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని అరూరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. కాంగ్రెస్ చేసే విష ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు సరిగ్గా తిప్పికొట్టలేకపోయారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాయని, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా తక్కువ సమయంలోనే అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మంచి పనులు చేసినా ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. ఉద్యోగాల విషయంలోనూ బీఆర్ఎస్‌ను బద్నాం చేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రేమను బీఆర్ఎస్ పొందలేదన్నారు. అలాగే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. మూడోసారి మోడీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతుబంధు ఇవ్వకుండా నోట్లో అరటిపండు పెట్టిందని, కేసీఆర్ కంటే గొప్పగా ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయారన్నారు. వంద రోజుల్లో కాకపోతే ఐదు సంవత్సరాలలోపు మీ హామీలు నెరవేర్చండని కాంగ్రెస్ కు సూచించారు.
Recent Comments