200కేజీల ఇత్తడి దొంగిలించిన దుండగులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడిలో ఘటన
స్పాట్ వాయిస్, మహబూబాబాద్(మరిపెడ): దేవుడి సేవలకు వినియోగించే ఇత్తడి వాహనాలను దుండగులు అపహరించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలోని సీతారామంచంద్రస్వామి ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయంలో స్వామి వారి సేవకు వినియోగించే ఇత్తడితో చేసిన గరుడ వాహనం, అశ్వ వాహనం, ఆంజనేయ వాహనం మూడు కలిపి సుమారు 200 కేజీల సొత్తు అపహరణకు గురైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దొంగిలించిన సొత్తు సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అయితే దుండగులు ఆలయ వెనుక భాగంలోని ఉద్యానవన ప్రదేశం నుంచి లోనికి ప్రవేశించి స్టోర్ రూం తాళాలు పగులగొట్టి వాహనాలు అపహరించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Recent Comments