సంగెం కాలువకు అడ్డుకట్ట..
అడ్డుకున్న రైతులు
అధికారులు, స్థానిక నాయకులపై మండిపాటు
స్పాట్ వాయిస్, నర్సంపేట, (ఖానాపురం) : మండలంలోని పాకాల చెరువు ప్రధాన కాలువ అయిన సంగెం కాలువకు మనుబోతుల గడ్డ పరిసరాల్లో కొందరు రైతులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బుధరావుపేట గ్రామానికి చెందిన రైతులు ఘటన స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. దీంతో అడ్డుకట్ట వేయడానికి యత్నించిన వారు అక్కడనుంచి వెళ్లిపోయారు. అనంతరం బుధరావుపేట రైతులు మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే సంగెం కాలువ పారకానికి రబీ తైబంధుని ఖరారు చేయడం జరిగిందన్నారు. దీంతో కాలువ పారకం కింద ఉన్న రైతులందరూ నారు పోసారిని చెప్పా రు. కానీ మోటార్లు రిపేరు, పైప్ లైన్ కి పగుళ్లు ఏర్పడటం కారణంగా పాకాల చెరువులోకి గోదావరి నీళ్లు రావడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయన్నారు. రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో రబీ సాగుకు నీరు అందుతుందో లేదో అని రైతులు ఆందోళన మొదలైందన్నారు. ఒకవేళ నీరందకపోతే వేల రూపాయల ఖర్చు పెట్టి పోసుకున్న నార్ల పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే కాల్వ మొదటి పారకంలోని కొందరు రైతులు కాలువకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దొంతి , అధికారులు స్పందించి రబీ సాగుకు సరిపడా నీరందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు యాకుబ్ పాష, లాదినేని ఎల్లయ్య, కృష్ణారెడ్డి, వల్లెపు కుమార్, సింగు సుధాకర్, గట్ల వీరేష్, నెలమర్రి నాగరాజు, సోమగాని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Recent Comments