ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉద్వేగ ప్రసంగం
ప్రజల సమక్షంలో కన్నీరు పెట్టి కౌశిక్ రెడ్డి
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..
నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతానని వినతి
కమలాపూర్ లో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం
స్పాట్ వాయిస్, కమలాపూర్ : ఎన్నికల్లో గెలిస్తే విజయయాత్ర చేస్తానని, ఓడిపోతే భార్య, కూతురితో కలిసి ఉరేసుకుంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కమలాపూర్ బస్టాండ్ కూడలిలో కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి, మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేశారు. 2018 నుంచి కమలాపూర్ ప్రజలకు సుపరిచితుడినని, మాట ఇస్తే తప్పేది లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే, మీ బిడ్డగా మీకు ఎల్లవేళలా అండగా ఉంటూ, అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తు్న్నానని పేర్కొన్నారు. తను గెలిస్తే కమలాపూర్ ను దత్తతగా తీసుకుని, మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దండం పెట్టి అడుగుతున్నా.. కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. మీకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో ముందుండి మీ సమస్యను తీరుస్తానని వేడుకున్నారు. మీ బిడ్డగా చంపుకుంటారో సాదుకుంటారో ఇక మీ ఇష్టం అంటూ మూడో తేదీన తాను గెలిస్తే విజయయాత్ర చేస్తానని, ఓడిపోతే నేను భార్య, కూతురు ముగ్గురం శవాలుగా మిగులుతామని కన్నీరు పెట్టుకున్నారు. కౌశిక్ రెడ్డి భార్య శాలిని మాట్లాడుతూ తన భర్త కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని మీ ఆడబిడ్డగా కొంగు పట్టి అడుగుతున్నానన్నారు. గెలిచిన తర్వాత కమలాపూర్ అభివృద్ధి పనులు కౌశిక్ రెడ్డి చేయకపోతే దగ్గరుండి నేను చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments