Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్‘తూర్పు’లో కార్పొరేటర్ల రహస్య భేటీ..

‘తూర్పు’లో కార్పొరేటర్ల రహస్య భేటీ..

గిరిలోనేనా.. గీత దాటుడా..?
సీక్రెట్ గా కలుసుకున్న ప్రజాప్రతినిధులు..
ఒక మాజీ సహా 15 మంది కార్పొరేటర్ల ములాఖత్..
ఎమ్మెల్యే తీరుకు నిరసనగా అనే ప్రచారం..
చర్చనీయాంశంగా ‘అరుదైన కలయిక’

స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అదో రహస్య భేటీ. ఓ మాజీ కార్పొరేటర్ తో సహా 15 మంది తాజా కార్పొరేటర్లు కలిసిన మీటింగ్. వాళ్లంతా ఎప్పుడు కలువని వారా.., ఎప్పుడూ మాట్లాడుకోని వారా.. అంటే అలాంటిదేం లేదు. అంతా తరుచుగా కలుసుకునే వారే., గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునే వారే. కానీ, ఈ సారి వారి కలయిక కలకలం రేపుతోంది. గతంలో ఎన్నిమార్లు జరిగినా రాని అనుమానాలు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ నేపథ్యంలో పుంఖానుపుంఖాలుగా వచ్చేలా చేస్తోంది. ఏదిఏమైనా ఇది గోడు వెల్లబోసుకోవడానికా.., గూడు చక్కబెట్టుకోవడానికా.. అనేది మాత్రం ఇప్పుడప్పుడే తేలకపోవచ్చు.

‘తూర్పు’లో రహస్య భేటీ..
వరంగల్ తూర్పునకు చెందిన 15 మంది కార్పొరేటర్లు గురువారం ఓ ప్రాంతంలో రహస్యంగా భేటీ అయ్యారు. ఓ మాజీ కార్పొరేటర్ సహా అంతా కలిసి సమావేశం నిర్వహించుకున్నారు. గంటల తరబడి పలు విషయాలపై మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమ స్థాయిని అసలు గుర్తించడం లేదని తీవ్ర నిరాశ నిస్పృహల్లోనే వారు కలయిక అంతర్యంగా తెలుస్తోంది. ఎవరికి వారుగా ఏడ్చేకంటే అంతా కలిసి ఓ ఏడ్పు ఏడ్చి, దానిని అధిగమించడానికి అనుసరించాల్సిన కర్తవ్యాన్ని చర్చించడానికి కలిసినట్టు సమాచారం.

సహాయ నిరాకరణే..?
బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ సహా 15 మంది కార్పొరేటర్లు గంటల తరబడి వాడివేడిగా చర్చలు జరిపిన అనంతరం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ మద్దతు ఇవ్వబోమని తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే పార్టీని వీడుతామని ఒకే మాటగా పేర్కొంటూ సదరు మద్దతు ప్రతులను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఒంటెత్తు పోకడల ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయామని, విలువలు లేకుండా జరుపుతున్న రాజకీయంలో నలిగిపోతున్నామని విచారం వ్యక్తం చేస్తూ సహాయ నిరాకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కార్పొరేటర్లని భయాందోళనకు గురిచేసినట్టుగా కూడా పలువురు రహస్యంగా వాపోయారు. ఇదే వేధింపులు ఇలాగే కొనసాగుతూ, పార్టీ పెద్దలు తమను పట్టించుకోకపోతే అవసరమైతే పార్టీని కూడా విడిపోవడానికి కూడా వెనకాడమని ఫ్రస్ట్రేషన్ ను వెళ్లగక్కారు.

ఎన్నడూ చూడని పరిణామాలు..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లంతా పేరుకే బల్దియాకు ఎన్నికైనట్టుగానీ ఎన్నడూ మేయర్ తో కలిసి నడిచింది లేదు. ఇన్నేళ్ల గ్రేటర్ కార్యవర్గంలో మేయర్, కొందరు కార్పొరేటర్ల మధ్య కనీసంగా మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేదు. కార్పొరేటర్లలోని ఆ వర్గమంతా ఎమ్మెల్యేకు అనుచరగణంగా నడుచుకుంటున్నారు. అలాంటి ఈ మధ్య ఎమ్మెల్యేకు అత్యంత ఆప్తులుగా చలామణి అయ్యే పలువురు కార్పొరేటర్లు మొదటి సారిగా మేయర్ ను కలిశారు. సంవత్సరాలుగా జరగని ఈ పరిణామంతో తూర్పు కారులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పైగా పలువురు మేయర్ ను కలిసిన ఆయన వర్గపు కార్పొరేటర్లు తమ ఫొటోలు, ఇతరత్ర సమాచారాన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టడం, అంతా చూశారని భావించగానే డిలీట్ చేయడం కూడా చేస్తూ ఏదో మెసేజ్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారనే విషయాన్ని కూడా రహస్యంగా విస్తరిస్తున్నారు. ఇదిలా ఉండగా తూర్పు బీఆర్ఎస్ లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆ బాపతు కార్పొరేటర్లను ప్రత్యక్షంగా అడగగా దాటవేత ధోరణి అవలంబించారేగానీ ముక్కుసూటిగా కొట్టిపారేయలేదు. పైగా, మరికొందరైతే నీళ్లు నములుతూ తామేదో సహజంగా కలుసుకుంటే ఇంత రాద్ధాంతం అవసరమా..? అనే ముక్తసరితో ముగించి జారుకున్నారు.

-ఏడాది క్రితమే చెప్పిన ‘స్పాట్ వాయిస్’
తూర్పులో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ‘స్పాట్ వాయిస్’ అప్పుడే చెప్పింది. ‘తూర్పులో తూఫాన్’ కార్పొరేటర్ల రహస్యభేటీ అని ఆగస్టు 26, 2022 రోజే సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు మళ్లీ ఆ కార్పొరేటర్లే రహస్యంగా సమావేశం కావడం కాకతాళీయమో, మరేమోగానీ రాబోయే రోజుల్లో పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి మరి..

RELATED ARTICLES

Most Popular

Recent Comments