కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి
బీఆర్ఎస్ ను గద్దె దించి..తొమ్మిదేళ్ల కష్టాలను తొలగిస్తాం
– అస్సాం సీఎల్పీ నేత, సీడబ్ల్యూసి మెంబర్ దేబద్రత సైకియా
– ఇంటింటికి ఆరు గ్యారెంటీ కార్డుల పంపిణీ ప్రారంభం
స్పాట్ వాయిస్, గణపురం: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని అస్సాం సీఎల్పీ నేత, సీడబ్ల్యూసి మెంబర్ దేబద్రత సైకియా అన్నారు. తుక్కుగూడ విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీ కార్డుల ఇంటింటికి పంపిణీ కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఊరేగింపుగా బైక్ ర్యాలీతో ఆయనను గణపురం మండల కేంద్రానికి స్వాగతం పలికారు. చౌరస్తాలో రోడ్ షో నిర్వహించి, రాజీవ్‌గాంధీ విగ్రహాని పూలమాలలు వేశారు. అనంతరం ఆరు గ్యారెంటి కార్డుల అంశాలను గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం, రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం, వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపుదల సంబంధించిన గ్యారెంటీ కార్డులను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా దేబద్రత సైకియా మాట్లాడుతూ…రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో అవినీతి, నియంతృత్వ పాలనతో ప్రజలను కష్టాలకు గురిచేశారని.. ప్రజలు ఈ తొమ్మిదేళ్లు పడిన కష్టాలను తాము అధికారంలోకి వచ్చి తొలగిస్తామని పేర్కొన్నారు. ఇకపై కేసీఆర్ ఆటలు సాగనివ్వబోమని ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చిందని చెప్పారు. గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని.. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతి కోసం – ప్రజల భవిత కోసం కాంగ్రెస్ ఇచ్చే హామీలతో కుడిన ‘అభయ హస్తం’ గ్యారెంటీ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 7286855555 నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ దూడపాక శంకర్, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ , మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, వైస్ ఎంపీపి విడిదినేని అశోక్, జిల్లా నాయకులు బోనాల రాజమౌళి, ఇమ్మడి వెంకటేశ్వర్లు, మామిండ్ల మల్లికార్జున్, సుంకరి సుధాకర్ రెడ్డి, కట్కూరి శ్రీనివాస్, దూడపాక దుర్గయ్య, కృష్ణ, కన్నెబోయిన కుమార్, నేరెళ్ళ రాజు, పున్నం తదితరులు పాల్గొన్నారు.
Recent Comments