గత ఎన్నికల వేళా ఇదే రోజు జాబితా విడుదల..
ఉత్కంఠగా కారు కేడర్..
ముహూర్తం వేళకు ఎన్ని మార్పులో..?
హమ్మయ్యా.. అనుకున్న ఘడియలు రాబోతున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నాళ్లకు సాక్షాత్కరించబోతోంది. ఐదేళ్ల నిరీక్షణకు సోమవారం సమయం ఆసన్నం కాబోతుండడంతో ఉత్కంఠకు తెరపడబోతోంది. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత సరిగ్గా శ్రావణ సోమవారం రోజే మొదటి విడత జాబితాను విడుదల చేశారు. ఇప్పుడు కూడా అదే రోజు తమ భవితవ్యం తేలబోతోందని కారు కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు లక్కు దక్కిన వారు మళ్లీ చిక్కేనా లేదా.. అనే టెన్షన్ లో ఉండగా, తమకు కూడా దక్కకపోతుందా అని కొత్తవారు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నియోజకవర్గాన్ని వీడిన నేతలంతా రాజధానిలోనే మకాం వేసి పావులు కదుపుతున్నారు.
స్పాట్ వాయిస్, బ్యూరో: 2018 ఎన్నికల వేళ సరిగ్గా శ్రావణ మాసం మొదటి సోమవారమే అధినేత కేసీఆర్ మొదటి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే ముహూర్తంగా ప్రకటించడంతో ఆశావహులతో పాటు తాజాలు కూడా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అధిక మాసమేమోగానీ తమకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఇప్పటికే నాయకులంతా తీవ్ర ఆందోళనలో ఉండగా, ఆ రోజు రావడంతో ఆనం దంతో కూడిన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
అధిక మాసంతో అవస్థలు..
ఎన్నికల సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసం ఎవరెవరికి ఏమోగానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం పరమ పవిత్రం. తమకు లక్కు దక్కుతుందా లేదా అని తేలేది మొదటి సోమవారమే కావడంతో నేతలంతా ఆత్రుతగా ఎదురు చూ స్తుం టారు. కానీ ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం రావ డంతో నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎక్కువ నెల రావడం ఏమోగానీ తమకు ఈ 30 రోజులు కంటిమీద కునుకు లేకుండా తీవ్ర టెన్షన్ కు గురయ్యామని పలువురు అనుచరగణం వద్ద వాపోతున్నారు. ఎలాగోలా ఆ క్షణాలను గడిపిన వారంతా ఈనెల 21 వ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడం శుభకార్యాలకు ముహూ ర్తాలు విపరీతంగా ఉండడంతో అందరి అంచనాలు తేలేం దుకు మరో నాలుగు రోజులు గడువు ఉందంటున్నారు. పై గా ఈ విడుత ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మూడు నెలల్లోపే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండ డంతో రాజకీయ పార్టీలన్నీ అధికారికంగా లిస్ట్ లు ప్రకటించడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అప్పుడు భారీ మెజార్టీ..
గత ఎన్నికల్లో కేసీఆర్ శ్రావణ సోమవారం రోజునే అభ్యర్థుల్ని ప్రకటించి, ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. అదే సెంటిమెంట్ ను ఇప్పుడు కూడా దొరకబుచ్చుకోవడానికి మళ్లీ శ్రావణ సోమవారాన్నే ముహూర్తంగా ఫిక్స్ చేసి జాబితా విడుదలకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు సోమవారాన్నే దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. ఈ నెల 21న శ్రావణ సోమవారం వస్తుండడంతో ఆ రోజు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా సుమారు 90 స్థానాలకు ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం.
హైదరాబాద్ లో తిష్ట…
ఈనెల 21న వెలువడబోయే జాబితాపై ఎవరి అంచనాల్లో వారున్నారు. తమకే టిక్కెట్ దక్కబోతోందని అంచనాల్లో ఆశావహులు ఉండగా, పనితనమే మళ్లీ తమకు ప్రాధాన్యం కల్పిస్తోందని తాజాలు పేర్కొంటున్నారు. అయితే కొందరు తాజాలకు టిక్కెట్ దక్కే చాన్స్ ఉండబోదని ఇప్పటికే ప్రచారం జరుగుతుండడంతో అంతా ఉత్కంఠగా ఉన్నారు. కాగా, ఈ తతంగమంతా ఏమోగానీ ఎవరికి వారుగా నేతలంతా హైదరాబాద్ లో తిష్టవేసి మరీ చక్కదిద్దుకునే ఏర్పాట్లలో ఉండడంతో నియోజకవర్గాలన్నీ నాయకులు లేక బోసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. జాబితా వచ్చే సరికి ఎన్ని సార్లు అటు ఇటుగా తిరుగుతారోగానీ ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజధాని కేంద్రంగా చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
Recent Comments