Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్రేపటి నుంచి రుణామాఫీ పున: ప్రారంభం

రేపటి నుంచి రుణామాఫీ పున: ప్రారంభం

సీఎం కేసీఆర్ ఆదేశం
నెలన్నరలో రుణమాఫీ పూర్తి చేయాలి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments