7వ తరగతి పిల్లోడు..
బ్యాంకు చోరీకి యత్నించాడు..
సీసీ ఫుటేజీలు చూసి షాకైన పోలీసులు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: చదివేది 7వ తరగతి.. కానీ ఈ బుడ్డోడు చేసింది వింటే ఆశ్చర్యపోతారు. డబ్బుల అవసరం వచ్చిందో.. మరేమో కానీ బ్యాంకుకు కన్నం వేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఎస్బీఐలో దొంగలు పడ్డారనే వార్త వణుకు పుట్టింది. గురువారం ఉదయం బ్యాంకు ఆవరణను శుభ్రం చేసేందుకు వచ్చిన ఓ మహిళ బ్యాంక్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి బ్యాంక్ వద్దకు వెళ్లి పరిశీలించారు. బ్యాంకులో నగదు, ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి అవాక్కయ్యారు. బ్యాంక్‌లో చోరీకి యత్నించింది ఏడో తరగతి చదువుతున్న పిల్లాడు. గడ్డపారతో బ్యాంక్‌కు వచ్చిన అతను ముందు గేటు తాళాలు పగులగొట్టాడు. ఆ తర్వాత బ్యాంక్ డోర్ కూడా పగులగొట్టి దర్జాగా బ్యాంక్ లోపలికి వెళ్లాడు. బ్యాంక్ లోపలికి వెళ్లగా.. ఎక్కడ డబ్బులు కనబడలేదు. దీంతో వెనుదిరిగాడు. నిందితుడు బ్యాంక్ సమీపంలో ఉంటున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ కొడుకుగా గుర్తించారు. అతని దగ్గరికి వెళ్లి విచారించగా.. బ్యాంక్ చోరీకి యత్నించింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Recent Comments