పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
– తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల జాక్
– కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా
స్పాట్ వాయిస్, గణపురం : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం జిల్లా కన్వీనర్ బోనాల రాజమౌళి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ పెన్షన్ దారులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్ సీ కాల పరిమితి ముగిసినందున జూన్ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పీఆర్సి కమిటీని నియమించాలని కోరారు. బకాయి ఉన్న 2 డీఏలను విడుదల చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును పటిష్ట పరిచి, నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్లు చెల్లించాలని, నెలల తరబడి ఈ- కుబేర్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. కనీస పెన్షన్ రూ.30 వేలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ బవేశ్ మిశ్రాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాక్ పరిశీలకులు పెండ్యాల బ్రహ్మయ్య, జిల్లా కో కన్వీనర్ వరుణకుమారి, జే. కరుణాకర్ రావు తదితరులు ఉన్నారు.
Recent Comments