Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్గృహలక్ష్మికి మార్గదర్శకాలు ఇవే..

గృహలక్ష్మికి మార్గదర్శకాలు ఇవే..

జీవో జారీ చేసిన సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం బుధవారం సాయంత్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్‌ ఎంపికకు వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వంతో ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయనుండగా.. సంబంధిత కుటుంబం ఫుడ్‌ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని సూచించింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో పథకం అమలు చేయనున్నారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరమన్నారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని, సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు, మొత్తం 4లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం సీఎం కేసీఆర్‌ ఆశయమని, గృహలక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరమని చెప్పారు. ఇదిలా ఉండగా.. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని మార్చి 9న జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నది.

వీరే ఆధ్వర్యంలోనే..
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. నోడల్ అధికారులుగా వీరే వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. ఇందుకోసం లబ్ధిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేషన్ కార్డు మస్ట్
రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇలా మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహారభద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి.. 59 ఉత్తర్వు కింద లబ్ధి పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ మేరకు బడ్జెట్‌ను నిధులను సైతం కేటాయించింది. ఈ పథకాన్ని జూలై నుంచి ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments