Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలు‘మిషన్ భగీరథ’ తో సంపూర్ణ ఆరోగ్యం

‘మిషన్ భగీరథ’ తో సంపూర్ణ ఆరోగ్యం

పథకంతో తీరిన తాగునీటి కష్టాలు
మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు
స్పాట్ వాయిస్, మహాదేవపూర్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకంతో సురక్షిత నీరు తాగి తెలంగాణ ప్రజలు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటున్నారని, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహాదేవపూర్ మండలం లోని పలు గ్రామాల్లో మంచినీళ్ల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలో భగీరథ నీళ్ల పండుగ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన సభలో సిబ్బందికి భగీరథ సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీపతిబాపు మాట్లాడుతూ ప్రజల తాగునీటి కష్టాలు స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే 1996లో సిద్దిపేట ప్రజల దాహార్తిని తీర్చడానికి పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించి సురక్షితమైన తాగునీటిని అందించాడని, అదే స్ఫూర్తితో యావత్తు దేశానికి ఆదర్శంగా అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణలో ప్రతీ ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్న మానవతావాది కేసీఆర్ అన్నారు. కోనంపేటలో వాటర్ బెడ్ ద్వారా నీటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా సురక్షితంగా భగీరథ నల్లా నీరు ట్యాంక్ ల ద్వారా ఇంటింటికీ వంద లీటర్ల నల్లా నీరు ప్రతి ఇంటికి అందేలా చూస్తున్నారని అన్నారు. గతంలో కొన్ని వాడల్లో నల్లా నీరు వచ్చేవి కావని, గొల్లవాడ, కాపువాడ, ఉప్పరి వాడ ప్రజలు నల్లా నీరు చూడలేదని, నల్లా నీటి కష్టాలు ఉండేవని, మిషన్ భగీరథతో ఉప్పరి వాడలో 30 ఇండ్ల ప్రజల తాగునీటి కష్టాలు తీర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. భగీరథ నీరు తాగక ముందు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు ఉండేవని, మిషన్ భగీరథతో ప్లోరైడ్ రహిత గ్రామాలుగా తెలంగాణ పల్లెలు మారాయని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మూడు ట్యాంక్ లు, అనుసంధానంగా మరో మూడు ట్యాంక్ లు, గ్రామంలో 23.69 కిలోమీటర్ల మేర పైపు లైన్లు, 2,622 నల్లా కలెక్షన్ల ద్వారా భగీరథ నీటి సరఫరా జరుగుతుందని ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ పరశురామ్ భగీరథ నీటి స్వచ్ఛత ను ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీపీ రాణిబాయి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments