తెలంగాణ ఓ సాహితీ వనం
-జిల్లా అదనపు కలెక్టర్ దివాకర
-కోటగుళ్ల వేదికగా తెలంగాణ సాహిత్య దినోత్సవం
స్పాట్ వాయిస్, గణపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ సారధ్యంలో సాహిత్య సాంస్కృతిక వికాసం మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతంగా వెలుగులోకి వచ్చి తెలంగాణ ఓ సాహితీ వనంగా మారిందని జిల్లా అదనపు కలెక్టర్ దివాకర అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని కోటగుళ్ల వేదికగా తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కవులు, కవయిత్రులు, సాహితీ వేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని, నాడు ఉద్యమ తెలంగాణ, నేడు ఉజ్వల తెలంగాణ అంటూ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ దివాకర తదితరులు జ్యోతి ప్రజ్వలనతో సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ దివాకర ప్రసంగించారు.
వలస పీడన పాలనలో మగ్గి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక మరుగునపడిపోయిన మన సాహిత్యం వికసించిందన్నారు. స్వయంగా కవి, రచయిత, నిత్య అధ్యయనశీలి అయిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిన సాహితీమూర్తులను గుర్తిస్తూ.. వారి రచనలకు విస్తృత గుర్తింపు తెచ్చారన్నారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు సద్గురు శినానంద నృత్యాలయ కూచిపూడి కళాకారులచే నిర్వహించిన రుద్రమదేవి నృత్య రూపకం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పి సీఈఓ విజయలక్ష్మి , డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, డీపీఓ. ఆశాలత, మైనారిటీ వెల్ఫేర్ బి.సునీత, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments