Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలుమహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు

మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు

 మంత్రి సత్యవతి రాథోడ్
రూ.15 లక్షలతో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
స్పాట్ వాయిస్, గణపురం: మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైలారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, కంట మహేశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అని, కులవృత్తుకులకు పనిలో చేయూతనివ్వడమే కాకుండా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు నేతన్నల తరహాలో గౌడ కుల వృత్తుల వారికి సైతం ప్రత్యేకంగా బీమా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు, కుల వృత్తుల వారిపై సీఎం కేసీఆర్ కు ఎంతో అభిమానం ఉందని, సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నామని, కల్లు దుకాణాల లైసెన్స్ బకాయిలు రద్దు చేశామని నీరా పాలసీ నీరా కేఫ్ ఏర్పాటు చేశామన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్ కులస్తులకు 15% రిజర్వేషన్లు కల్పించామని మంత్రి తెలిపారు. మైలారం గ్రామ అభివృద్ధికి సీడీఎఫ్ నిధుల నుంచి పది లక్షలు మంజూరు చేస్తున్నామని, కంఠమహేశ్వరం ఆలయం వరకు త్వరలోనే రోడ్డు మజిలీ చేస్తామని తెలిపారు. అనంతరం చెల్పూర్ లో రూ.15 లక్షల వ్యయంతో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. మాతృమూర్తి దినోత్సవం నాడు మహిళలచే ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారని, గత సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకతల నిర్వహణ సమయంలో ఉదయం రాగి జావా అందించామని, ప్రస్తుత సంవత్సరం చిరుధాన్యాలతో టిఫిన్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి కలెక్టరుకు సూచించారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలో 450 అంగన్ వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాలతో మహిళలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద బాలింతలకు చిరుధాన్యాలతో ఆహార అందిస్తున్నారని, మన భూపాలపల్లి జిల్లాలో సైతం దానిని అమలు చేయాలని, దానికి అవసరమయ్యే 40 లక్షలను ప్రత్యేకంగా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గర్భవతులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రతి గర్భవతికీ రెండు సార్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని, ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 260 కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేస్తున్నామని అన్నారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణం, అప్రోచ్ రోడ్ పనులు మంజూరు చేసి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసే విధంగా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి పేర్కొన్నారు. మహిళలు సొంతంగా ఆదాయం సమకూర్చుకునే విధంగా మరిన్ని అవకాశాలు కల్పించాలని, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ.400 కోట్లు వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ప్రతినెల కనీసం 15 వేల ఆదాయం వచ్చే విధంగా వివిధ అవకాశాలు పరిశీలించాలని మంత్రి సూచించారు.

చిరుధాన్యాలతో ఆరోగ్యం..
పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో జీవన విధానం మారిపోవడం మన ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల చాలామంది 50 సంవత్సరాలకు షుగర్ మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మన పూర్వీకులు ఆహారమైన చిరుధాన్యాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించి పౌష్టికాహార అలవాటు చేసుకునే విధంగా మార్పు రావాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలతో వివిధ రకాల వ్యాపారాల నిర్వహణ చేయాలని, ప్రస్తుతం పుట్టగొడుగులకు బాగా డిమాండ్ ఉందని, పుట్టగొడుగుల తయారు చేసే విధంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు గల అవకాశాలను అన్వేషిస్తూ ప్రణాళిక తయారు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిని, అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, ముఖ్య ప్రణాళిక అధికారి శామ్యూల్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments