సమస్యలు పరిష్కరించాలంటూ దీక్ష
స్పాట్ వాయిస్, మంగపేట : బిల్ట్ కార్మికులు మళ్లీ రోడ్డేక్కారు. మా సమస్యలు ప్రభుత్వాలకు పట్టదా అంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే తాము గుర్తుకు వస్తామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కార్మికులు మంగళవారం ఉదయం కర్మగారం ప్రధాన ద్వారం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. 2014 ఏప్రిల్ 5న బిల్ట్ కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేసిన నాటి నుంచి బిల్ట్ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, ట్రేడ్ యూనియన్లు తమ గురించి, మా సమస్యలపై పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. NCLT కోర్టు తీర్పు రీ సొల్యూషన్ ప్రొఫెషన్ ( ఆర్ పీ )(మిడియోటర్) కి 69 కోట్లు, బిల్ట్ కార్మికులకు 6 కోట్లు కేటాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై NCLT కోర్టు పునఃసమీక్షించాలని కోరారు.
బిల్ట్ కార్మికుల పెండింగ్ లో ఉన్న 52 నెలల జీతాలు చెల్లించాలని, 64 నెలల పెండింగ్ పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) చెల్లించాలని , గ్రాడ్యువిటీ చట్టం ప్రకారం కార్మికులకు అందించాలని కోరారు. అలాగే పీఎఫ్ కార్మికులకు ఫుల్ సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్ కర్మాగారానికి ఇస్తానన్న రూ.327 కోట్లు కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలని, రిటైర్మెంట్ అయిన కార్మికులకు సెటిల్మెంట్ చేసి వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బిల్ట్ కార్మికుల సమస్యపై స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recent Comments