వారంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ జీవో
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : మరో వారం రోజుల్లో రాళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల ఇన్ పుట్ సబ్సిడీ విడుదలకు సంబంధించిన జీవో విడుదల కానున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ (పంటనష్టం) వివరాలపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2023లో సంభవించిన వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఉన్నప్పటికీ నియోజకవర్గ పర్యటనకు వచ్చారన్నారు. వారి ఆదేశాల మేరకు సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారాన్ని నివేదికగా తయారుచేసి జిల్లా కలెక్టర్ కి పంపినట్లు చెప్పారు.
నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతుల వివరాలు…
నర్సంపేట మండలంలో 5800 మంది రైతులకు చెందిన 5300 ఎకరాలు, దుగ్గొండి మండలంలో 8374 మంది రైతులకు చెందిన 10,292 ఎకరాలు, చెన్నారావుపేట మండలంలోని 5329 మందికి చెందిన 5604 ఎకరాలు, ఖానాపురం మండలంలో 4332 మందికి చెందిన 6453 ఎకరాలు, నల్లబెల్లి మండలంలో 3049 మంది రైతులకు చెందిన 3505 ఎకరాలు, నెక్కొండ మండలంలో 6205 మంది రైతులకు చెందిన 6260 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్దారించినట్లు తెలిపారు. మొత్తం నర్సంపేట డివిజన్ లో అన్ని పంటలు కలుపుకొని 32,649 మంది రైతులకు చెందిన 37,498 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు చెప్పారు. గత సంవత్సరంలో వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం దాదాపు 50 శాతం పూర్తయిందని మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వడగండ్ల వర్షం వల్ల మిర్చి పంట చాలావరకు నష్టపోయి రైతులు అప్పులపాలయ్యారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా దానికి వారు సానుకూలంగా స్పందించారన్నారు.
ఉత్తర యుద్దానికి ఎన్ఆర్ఈజీఎస్ జేఏసీ మద్దతు
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నర్సంపేట డివిజన్ లో చేపట్టిన ఉత్తర యుద్ధం కార్యక్రమానికి ఎన్ఆర్ఈజీఎస్ జేఏసీ ఆదివారం మద్దతు తెలిపింది. జేఏసీ రాష్ట్ర చైర్మన్ లింగయ్య మాట్లాడుతూ ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ప్రతి రైతు ఆర్థికంగా వృద్ధి చెందుతారన్నారు. సుమారు 262 పనులను ఈజీఎస్ పథకంలో పొందుపరచడం జరిగిందన్నారు. కేంద్రం 50 శాతం వరకు పనిదినాలను తగ్గించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మద్దతును పొందుతూ త్వరలో జాతీయస్థాయిలో సంచలనం కానుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు జేఏసీ రాష్ట్ర చైర్మన్ లింగయ్య, కో-చైర్మన్లు వెంకట్ రామిరెడ్డి, మోహన్ రావు, రాజు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు స్వామి చౌహన్, డివిజన్ అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments